ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని.. ఏపీ మంత్రి అప్పలరాజు .. నేరుగా ప్రజలకు సందేశాన్ని పంపేశారు. పలాసలో ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ఎప్పుడైనా ఎన్నికలు వస్తాయి కనుక సిద్ధంగా ఉండాలన్నారు. మనం ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేస్తున్నామని కూడా ఆయన వారికి గుర్తు చేశారు. ఆయన ఉద్దేశం ప్రకారం గడప గడపకూ వెళ్తున్నది ఎన్నికల ప్రచారం అన్నమాట. అప్పలరాజు అన్న మాటలు ఒక్క సారి రాష్ట్రం మొత్తం వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే..ఏపీలో అలాంటి రాజకీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వాన్ని ఆర్థిక సమస్యలు చుట్టు ముడుతున్నాయి. చెల్లించాల్సిన వడ్డీలు, అప్పులు కొండల్లా పెరిగిపోతున్నాయి. మరో వైపు ఏపీలో వ్యాపారాల్లేక.. పరిశ్రమలు రాక ఆదాయం మాత్రం దారుణంగా పడిపోతోంది. మద్యం ద్వారా ప్రజల నుంచి పిండుకుంటున్న ఆదాయం పాతిక వేల కోట్లకు చేరింది కానీ ఓవరాల్గా ఆదాయం మత్రం గత ఏడాది తరహలాోనే ఉంటోంది. అంటే.. ఎంత దారుణంగా ఇతర రంగాలు పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పథకాలకు డబ్బులు అప్పులు దక్కే పరిస్థితి లేదు. జీతాల చెల్లింపే ప్రతీ నెలా ఆలస్యం అవుతోంది.
అదే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత భారీగా పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. విపక్షాలు ఏకం అవుతున్నాయి. వీటన్నింటినీ తట్టుకోవాలంటే.. ముందస్తు ఎన్నికలే మార్గమని పీకే టీం కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఆ దిశగానే ఉంటున్నాయి. ఎలా చూసినా ఏడాది ముందే ఎన్నికలు ఉంటాయని.. ఒక వేళ ముందస్తుకు వెళ్లినా ఓటమి తప్పదనుకుంటే… ఏడాది పాలన ఎందుకు పోగొట్టుకోవాలని ఆయన వెనక్కి తగ్గే చాన్స్ ఉందంటున్నారు. అయితే ఎక్కువ శాతం ముందస్తు ఖాయమన్న వాదన వైసీపీలోనూ ఇప్పుడు వినిపిస్తోందని అప్పలరాజు చెప్పకనే చెబుతున్నారు.