మార్చిలో టాలీవుడ్ కాస్త తేరుకొంది. ‘గామి’కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ‘ఓం బీమ్ బుష్’ ప్రేక్షకుల్ని నవ్వించింది. ‘టిల్లు స్క్వేర్’ వసూళ్లు దండుకొంటోంది. ఈలోగా.. ఏప్రిల్ లోకి అడుగు పెట్టేశాం. ఈ ఉత్సాహంతో ఈవారం కూడా కొత్త సినిమాలు వరుస కడుతున్నాయి. ఈ శుక్రవారం 4 చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి. అయితే అందరి దృష్టీ.. ‘ఫ్యామిలీ స్టార్’పైనే.
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈచిత్రానికి పరశురామ్ దర్శకుడు. ‘గీత గోవిందం’ తరవాత విజయ్ – పరశురామ్ కాంబో నుంచి వస్తున్న సినిమా కాబట్టి, సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. టైటిల్‌తోనే కుటుంబ ప్రేక్షకులకు గాలం వేశారు. ఫ్యామిలీ అంతా థియేటర్లకు వెళ్లే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. పైగా సమ్మర్ సీజన్. కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమాకు మించిన ఆప్షన్ వేరేది లేదు. విజయ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఏమాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా, ఈ సినిమా దుమ్ము రేపడం ఖాయం. మృణాల్ టైమ్ మామూలుగా లేదు. తన సినిమాలన్నీ హిట్టే. లేటెస్టుగా ‘హాయ్ నాన్న’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకొంది. ఎలా చూసుకొన్నా.. ‘ఫ్యామిలీ స్టార్’కి అన్ని మంచి శకునాలే కనిపిస్తున్నాయి.
ఈ సినిమాతో పాటు ‘భరతనాట్యం’, ‘బహుముఖం’ అనే రెండు చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మలయాళంలో మంచి విజయాన్ని అందుకొన్న ‘మంజుమల్ బోయ్స్’ కూడా ఈవారమే డబ్బింగ్ రూపంలో తెలుగులోకి వస్తోంది. దీంతో పాటు సందీప్ కిషన్ నటించిన తమిళ చిత్రం ‘మాయవన్’ ఏడేళ్ల తరవాత తెలుగులో ‘ప్రాజెక్ట్ జెడ్’ పేరుతో తీసుకొస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయిగా నటించింది.