ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి రానీయ కూడదన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ.. అనేక వ్యూహాలను అమలు చేస్తోంది. అందులో కులాల కుంపట్లు ఎపిసోడ్ ఇప్పుడు నడుస్తోంది. దీనితో పాటు.. తెలుగుదేశం పార్టీ అనుకూల ఓటింగ్‌ను చీల్చే వ్యూహంతో.. బీజేపీ కొత్త పార్టీల ఏర్పాటుకు ఇతరులను ప్రొత్సహిస్తోందని… ప్రముఖ జర్నలిస్ట్ వేమూరి రాధాకృష్ణ .. తన వీక్లీ కాలమ్ ” కొత్త పలుకు”లో రాశారు. అందులో ఒకరు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కాగా.. మరొకరు… అరకు ఎంపీ కొత్తపల్లి గీత.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజకీయం విషయంలో ఇప్పటి వరకూ.. ఒక్క శాతం కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఒక్క వైసీపీ తప్ప.. ఆయన అన్ని పార్టీల్లోనూ చేరబోతున్నారని.. ప్రచారం జరిగింది. అదే స్థాయిలో..ఆమ్ ఆద్మీ పార్టీకి ఏపీలో అంతా తానై వ్యవహరిస్తారని..లేదు తానే సొంతంగా పార్టీ పెడతారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ లక్ష్మినారాయణ మాత్రం గుంభనంగా ఆయన పని ఆయన చేసుకెళ్లిపోతున్నారు. ఓ రెండు నెలల్లో ఆయన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. లక్ష్మినారాయణ పార్టీ పెడితే.. ఆయనకు ఉన్న ఇమేజ్ ప్రకారం కచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ప్రభావం ఏ పార్టీపై ఉంటుందన్నది తర్వాత విశ్లేషణ.
కానీ విచిత్రంగా కొత్తపల్లి గీత కూడా పార్టీ పెట్టబోతున్నారన్నదే కాస్తంత… ఆశ్చర్యపరిచే విషయం. ఎందుకంటే.. కొత్తపల్లి గీత వైసీపీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. టీడీపీకి కొంత కాలం సన్నిహితంగా ఉన్నా.. ఆ తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు. చూస్తూ చూస్తూ బీజేపీలో చేరలేరు కాబట్టి… ఆ పార్టీ నేతలు… నేరుగా ఓ పార్టీ పెట్టేయమని సలహా ఇచ్చారట. దానికి సంబంధిచిన సహాయసహకారాలు వారే అందిస్తున్నారు. రేపో మాపో కొత్తపల్లి గీత పార్టీ ప్రకటన ఉండే అవకాశం ఉంటుంది.
కానీ కొత్తపల్లి గీతతో పార్టీ పెట్టించడం వల్ల బీజేపీకి లాభం ఏమిటి అన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు. ఆమెకు ఏ వర్గంలోనూ… చివరికి ఎస్టీల్లోనూ పలుకుబడి లేదు. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్‌పైనే మొన్నటిదాకా వివాదం వడిచింది. ఇక హైదరాబాద్‌లో ఆమె ఆర్డీవోగా పని చేస్తున్నప్పుడు శివారు ప్రాంతాల్లో వందల ఎకరాల భూమిని భర్తకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి కట్టబెట్టింది. ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసేసుకుంది. ఇక ఆమె భర్తపై అనేక మోసం కేసులున్నాయి. చివరికి కొత్తపల్లి గీతపై కూడా బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారితో పార్టీ పెట్టింది. . బీజేపీ ఏం బావుకుంటుందో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. కనీసం బీజేపీ నేతలకైనా తెలుస్తుందో లేదో..!