డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్… క్లుప్తంగా డిఎస్పి. థియేటర్లకు మూవీ కంటెంట్ సప్లై చేసే క్యూబ్, యు.ఎఫ్.ఓ. సంస్థలు అన్నమాట. నిన్న మొన్నటివరకూ సినిమావాళ్ళకు మాత్రమే తెలిసిన వీళ్ళ గురించి థియేటర్ల బంద్ పుణ్యమా అని సామాన్య ప్రేక్షకులకు సైతం ఈ సంస్థల పేర్లు తెలిశాయి. కొందరు నిర్మాతలు, పంపిణీ దారులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ సంస్థలు తెరపైకి కనిపించని మూవీ మాఫియాగా అవతరించాయి. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని సందర్భాల్లో చాలామంది డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్న ఆ నలుగురు తమకు అన్యాయం చేస్తున్నారని విమర్శలు గుప్పించేవారు. కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… ఆ నలుగురు గానీ, మరొకరు గానీ థియేటర్లు ఇచ్చినా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ కంటెంట్ ఇవ్వకపోతే సినిమాను ప్రదర్శించలేని పరిస్థితి.
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ప్రతి థియేటర్‌కి ప్రొజెక్టర్, సర్వర్ ఇచ్చారు. ప్రొజెక్టర్ థియేటర్లో వున్నా.. సర్వర్ మాత్రం వాళ్ళ చేతిలోనే వుంటుంది. వాళ్ళు మూవీ కంటెంట్ ఇస్తేనే థియేటర్లో ప్రదర్శించే వీలుంటుంది. ఓనర్‌కి ఇష్టం వచ్చిన సినిమా వేసుకోవడానికి వీల్లేదు. పోనీ… ప్రొజెక్టర్ ఫ్రీగా ఇచ్చారా? అంటే అదీ లేదు. దానికోసం ఐదు లక్షల రూపాయలను డిపాజిట్‌గా తీసుకున్నారు. మళ్ళీ మూవీ కంటెంట్ ఇచ్చినందుకు ప్రతి వారం ఒక్కో థియేటర్ నుంచి సుమారు పది నుంచి ముప్ఫై వేలు తీసుకుంటున్నారు. ఈ చార్జీలు తగ్గించమని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. అలా కాకుండా ప్రొజెక్టర్స్ రేట్ ఎంతో చెప్పండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామంటున్నా ఒప్పుకోవడం లేదు.
థియేటర్ ఓనర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్ తమకు నచ్చిన సినిమాను థియేటర్లో వేసుకోలేని విధంగా క్యూబ్, యు.ఎఫ్.ఓ. సంస్థలు చిత్రపరిశ్రమను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. దీనిపైనే ఇప్పుడు చిత్రపరిశ్రమ నిరసన చేపట్టింది. థియేటర్ల బంద్‌కు పిలుపు ఇచ్చింది. ఇరు పక్షాల మధ్య చర్చలు విఫలం కావడంతో శనివారం కూడా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల గేట్లు తెరుచుకోలేదు. తెలుగు సిన్మాలు ఎక్కడా ప్రదర్శితం కాలేదు. కొన్ని మల్టీప్లెక్స్‌లలో హిందీ, ఇంగ్లిష్ సిన్మాలను ప్రదర్శించారు. వాటి ప్రదర్శనల్ని కూడా నిలిపివేయాలని మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో చిత్రపరిశ్రమ వర్గాలు సంప్రదిస్తున్నాయి.