ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి- అరికెపూడి గాంధీ మధ్య మొదలైన సవాళ్లు, ప్రతి సవాళ్లు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. పార్టీ మారిన అరికెపూడి గాంధీకి చీర గాజులు పంపుతా, ఆయన ఇంటికి వెళ్లి జెండా ఎగురవేస్తానంటూ కౌశిక్ రెడ్డి చేసిన సవాలుకు గాంధీ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోసం ఎదురుచూసిన గాంధీ… తనే స్వయంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ఎమ్మెల్యే గాంధీని కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కౌశిక్ రెడ్డి ఇంట్లోనే ఉండిపోవటంతో… రారా నా కొడకా, చూసుకుందాం అని రంకెలు వేసి ఇంట్లో ఉన్నావ్ అంటూ ఎమ్మెల్యే గాంధీ మండిపడ్డారు. ఇరువురు నాయకుల కార్తకర్తలు ఒకరిపై ఒకరికి దూసుకొచ్చేందుకు ప్రయత్నం చేయటం, రాళ్లు-కోడిగుడ్లులు చేయటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కౌశిక్ రెడ్డి వచ్చే వరకు ఇక్కడే ఉంటా… రారా నా కొడకా అంటూ ఎమ్మెల్యే గాంధీ కుర్చీ వేసుకొని కూర్చుకున్నారు. నువ్వు ఎలాంటి వాడివో గవర్నర్ గారి కోటాలో ఎమ్మెల్సీ ఇస్తే ఆపినప్పుడే అందరికీ అర్థం అయ్యింది అంటూ ఆయన మండిపడ్డారు. అయితే, కౌశిక్ రెడ్డి మాత్రం రేపు మేడ్చల్ పార్టీ ఆఫీసుకు రా, అక్కడి నుండి బీఆర్ఎస్ కండువా కప్పుకొని కేసీఆర్ దగ్గరకు వెళ్దాం అంటూ ప్రకటించారు. నన్ను హత్య చేసేందుకే ఇక్కడి మందితో వచ్చారంటూ కామెంట్ చేశారు.
కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొనటంతో… ఎమ్మెల్యే గాంధీని పోలీసులు బలవంతంగా కౌశిక్ రెడ్డి ఇంటి నుండి పంపించి వేశారు.