తన 42 ఏళ్ల సినీ కెరీర్లో విశ్వక్సేన్ లాంటి అన్‌ప్రొఫెషనల్ ని చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు సినియర్ హీరో అర్జున్. ఆయన దర్శకత్వంలో విశ్వక్సేన్, ఐశ్వర్య సర్జా కీలక పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, గత కొన్ని రోజులుగా చిత్ర బృందానికి, విశ్వక్సేన్కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ సినిమా విశ్వక్సేన్ చేయడం లేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు పుట్టించింది విశ్వక్సేనే అని ఆరోపిస్తూ అర్జున్ విలేఖరుల సమావేశం నిర్వహించారు.
”నా కెరీర్లో ఒకరిని గురించి ప్రెస్‌మీట్ పెట్టి ఎప్పుడూ చెప్పలేదు. విశ్వక్సేన్ చేసిన పనికి బాధకలిగింది. కొత్త షెడ్యూల్ కోసం కష్టపడి సెట్‌ను డిజైన్ చేశాం. ఉదయాన్నే ఆరు గంటలకు షూటింగ్ స్పాట్‌కు రావాలని అందరికీ ముందే చెప్పా. ‘సర్ ఐయామ్ సారీ. ప్లీజ్ క్యాన్సిల్ షూట్’ అవిశ్వక్ మెసేజ్ పెట్టాడు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడనిపించింది. నేను జీర్ణించుకోలేకపోయా. ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంటే అతనికి మర్యాద లేదా? నేను అల్లు అర్జున్‌తో కలిసి పనిచేశా. షూటింగ్ అంటే సమయానికి వచ్చేస్తారు. అంత డబ్బు, ఇమేజ్ ఉన్నా ఇంకా కష్టపడుతూనే ఉంటారు కానీ, ఇతను మాత్రం ‘రేపు షూటింగ్ క్యాన్సిల్ చేయండి’ అని మెసేజ్‌లు పెడుతాడు. ఇది ఆయన గురించి చెడుగా ఆరోపణలు చేయడం కాదు. నా ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లడం అంటే నా ప్రతిష్టకు దెబ్బ తగిలినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో అతనితో నేను సినిమా చేయదలచుకోవడం లేదు. కొన్ని రోజులు పోయిన తర్వాత అతనితో కాంప్రమైజ్ అయి, ఈ సినిమా చేయను. ఈ వివాదంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ మెంబర్స్‌తో మాట్లాడతా. నేను ఇక్కడ సినిమాలు మాత్రమే చేయడానికి వచ్చా కానీ వివాదాలు సృష్టించడానికి కాదు. చాలా ఆవేదనతో ఈ మాట చెబుతున్నా” అని పేర్కొన్నారు అర్జున్.