విజయవాడను వరద ముంచెత్తటానికి ప్రధాన కారణాల్లో ఒకటి బుడమేరు. బుడమేరుకు గండ్లు పడటంతో నష్టం మరింత ఎక్కువైంది. దీంతో గండ్లు పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా, పనులకు అంతరాయం ఏర్పడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ సహయం కోరింది.
హుటాహుటిన విజయవాడకు చేరుకున్న ఆర్మీ అధికారులు, ఇంజనీర్లు బుడమేరు గండ్లను పరిశీలించారు. వస్తున్న వరదను డైవర్ట్ చేస్తూ… గండ్లను పూడ్చాల్సి ఉంది. భవిష్యత్ లో మళ్లీ గండ్లు పడకుండా పటిష్టంగా పనులు చేయాల్సి ఉంది.
అయితే బుడమేరు గండ్లు కొన్ని చోట్ల చాలా పెద్దవిగా ఉన్న నేపథ్యంలో… తాత్కాలిక వంతెన వేస్తే పనులు వేగంగా పూర్తి చేయవచ్చని ఆర్మీ సూచించింది. ఆర్మీ అధికారులతో మంత్రి నిమ్మలతో పాటు ప్రభుత్వ అధికారులు సమీక్ష నిర్వహించారు. ఆర్మీ అడిగిన వాటిని సమకూర్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఆర్మీ ఇంజనీర్ల సూచన మేరకు పనులు ప్రారంభం కాబోతున్నాయి. వారు అడిగిన సామాగ్రిని ఏర్పాటు చేయగానే పనులు ఊపందుకోబోతున్నాయి.
బుడమేరుకు గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు పనులు చేసి ఉంటే ఇంత జల ప్రళయం జరిగి ఉండేది కాదని, శాశ్వతంగా బుడమేరుతో ఇబ్బందులు లేకుండా పనులు చేయాల్సి అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.