తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని .. పోలీసు వ్యవస్ధ విఫలం అయిందని రాష్ట్రపతి పాలన పెట్టాలని చేస్తూ సోమవారం చంద్రబాబు బృందం రాష్ట్రపతిని కలవనుంది. అయితే ఈ దాడుల విషయంలో ” అభిమానస్తుల బీపీ పెరిగిన వారి” చర్యగా భావించి సమర్థిస్తూ వచ్చిన పోలీసులు హఠాత్తుగా అరెస్టులు చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. శనివారం పది మందిని అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. మళ్లీ ఆదివారం మరో ఆరుగుర్ని అరెస్ట్ చేసిటన్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు.
నిజానికి టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో నిందితులు హత్యాయత్నానికి పాల్పడిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం ట్రెస్ పాసింగ్ కేసులుమాత్రమే పెట్టారు. ఈ అంశంపైనా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అదే సమయంలో దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించలేదు. సీసీ టీవీ ఫుటేజీ కావాలంటూ కార్యాలయం గోడకు నోటీసులు అంటించి వెళ్లారు. ఇదంతా పోలీసులు ఆడుతున్న నాటకమని.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే నిందితుల్ని అరెస్ట్ చేశామని. కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పడానికి పోలీసులు ఈ తరహా అరెస్టులు చేస్తున్నారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.
రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన తర్వాత టీడీపీ తమ దగ్గర ఉన్న సాక్ష్యాలు, పోలీసులు పెట్టిన తప్పుడు కేసులతో సహా మొత్తం కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుటికే టీడీపీ లీగల్ సెల్ కసరత్తు పూర్తి చేసిందని.. దాడిలో పాల్గొన్న వారిలో పది మంది పోలీసుల్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. దీంతో ముందు ముందు ఈ అంశం కీలక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.