కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ అశోక గజపతిరాజు పార్టీ మీద కాస్త అలిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. అందుకే, ఆయన ఈ మధ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదనేది అభిప్రాయమూ వినిపిస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. సొంత జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమానికి రాకపోవడం ఈ చర్చకు ఆస్కారం ఇస్తోంది. అంతేకాదు, శనివారం జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశానికీ డుమ్మా కొట్టారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ మీద ఏదైనా కారణంతో అలకబూనారా అనే కథనాలు వినిపిస్తున్నాయి.
ఈ మధ్యనే మరో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కిశోర్ చంద్రదేవ్ టీడీపీలోకి రాబోతున్నట్టు ప్రకటించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేస్తున్న సమయంలోనే… కిశోర్ కూడా అక్కడికి వెళ్లి కలిసి వచ్చారు. టీడీపీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నాననీ, త్వరలోనే అధికారికంగా చేరతానంటూ స్వయంగా మీడియాతో చెప్పారు. అయితే, కిశోర్ చంద్రదేవ్ చేరికకు సంబంధించిన అంశమై పార్టీలో చర్చ జరగలేదనీ, ఈ వ్యవహరమై తనతో సీఎం చర్చించలేదనే అభిప్రాయం అశోక్ గజపతికి కలిగిందనీ, ఆయన్ని పార్టీలోకి చేర్చుకోవాలనే సంకేతాలు ఇచ్చే ముందు తన అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది కదా అనే అభిప్రాయంతో ఉన్నారనీ కొంతమంది అంటున్నారు. ఆ అసంతృప్తితోనే ఈ మధ్య కాస్త మౌనంగా ఉంటున్నారనే ప్రచారం జరుగోతోంది. అంతేకాదు, సామాజిక మాధ్యమాలతోపాటు, మీడియాలో కూడా ఆయన త్వరలోనే పార్టీ వీడతారా అంటూ కొన్ని అభిప్రాయాలు కనిపిస్తున్నాయి.
ఈ మధ్య టీడీపీ నేతలు పార్టీ వీడతారనే ఒక మైండ్ ప్లే అవుతున్న సంగతి తెలిసిందే. అశోక్ గజపతి విషయంలో కూడా అలాంటిదే ఈ కథనాలకు కారణమా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సింది ఉంది. అయితే, దీనిపై అశోక్ గజపతిరాజు స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది. పోలిట్ బ్యూరో సమావేశానికి రాకపోవడానికి కారణం ఆయనే చెప్పాల్సి ఉంది. ఇక, కిశోర్ చంద్రదేవ్ ను పార్టీలోకి తీసుకోవడం వల్ల ఆయనకి రాజకీయంగా పెద్దగా ఇబ్బంది వచ్చే పరిస్థితి లేదు. పైగా, పార్టీ నుంచి టిక్కెట్ ఆశించి తాను రావడం లేదని ఆయనే స్పష్టం చేశారు. మొత్తానికి, తాజా కథనాలపై అశోక్ స్పందిస్తే తప్ప, ఈ ప్రచారాలకు ఒక ముగింపు రాదనే చెప్పాలి.