విశాఖ విమానాశ్రయంలో ఇండిగో విమాన సిబ్బందిపై టిడిపి ఎంపి జెసి దివాకరరెడ్డి దురుసు ప్రవర్తన అందరి ఖండనకూ గురైంది. ఆ తర్వాత జాతీయ మీడియాతోనూ తెలుగు మీడియాతోనూ జెసి ప్రవర్తించిన తీరు మరో వీరంగంగా మారింది. అయితే ఇంత అయిన తర్వాత విమాన యాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు జెసికి బోర్డింగ్ పాస్ ఇప్పించి పంపడం కూడా విమర్శకు దారితీసింది. ఒకవైపు అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వున్న వివాదాలను సర్దుబాటు చేసేందుకు విన్యాసాలు చేస్తుంటే జెసి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టడం టిడిపిని ఇరుకున పెట్టింది. ఆయనకు అశోక్ గజపతి వత్తాసు నివ్వడం ఎవరూ హర్షించలేదు. మొదట ఇండిగో సంస్థ జెసి ప్రయాణాలకు అవకాశమివ్వరాదని నిర్ణయిస్తే తర్వాత ఎయిర్ఇండియా, స్పైస్‌జెట్ కూడా ఆ జాబితాలో చేరాయి. విమానయాన శాఖ దీనిపై న్యాయవిచారణకు ఆదేశించింది.ఇదంతా అయ్యాక జెసి తన చర్యకు విచారం వెలిబుచ్చారని కొన్ని వార్తలు వచ్చాయి గాని ధృవీకరణ జరగాల్సివుంది. ఇక ఈ దశలో అశోక్ గజపతి కూడా పరువు కాపాడుకునే పనిలో పడ్డారు. విమానాశ్రయానికి గంట ముందు వచ్చినా సిబ్బంది పాస్ ఇవ్వలేదని అబద్దం చెప్పారని ఆరోపించారు. ఆయన ఇప్పుడు ఏం చెప్పినా నిన్న మాత్రం జెసిని కాపాడారన్నది నిజం.