ఓ మాదిరి, మీడియం సైజు సినిమాలు వరుసగా బోల్తా పడుతున్న రోజులు ఇవి. బడా స్టార్ సినిమాలకు సైతం ఓపెనింగ్స్ దొరకడం లేదు. ఇక చిన్న సినిమాలంటారా, వాటి సంగతి దేవుడెరుగు. ఇలాంటి సమయంలో ఏ సినిమాకైనా నిర్మాతలు ఆచి తూచి ఖర్చు పెట్టాల్సిందే. హీరోల మార్కెట్‌కి మించి రూపాయి పెట్టినా.. అది రిస్కీ మేటరే. అలాంటిది దుల్కర్ సల్మాన్‌పై రూ.45 కోట్లు పెట్టారు ఆశ్వనీదత్.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం `సీతారామం`. ఇది వరకు `మహానటి`లో ఓ కీలకమైన పాత్ర చేసిన దుల్కర్ సల్మాన్.. పూర్తి స్థాయి హీరోగా ఓ తెలుగు సినిమా చేయడం `సీతారామం`తోనే తొలిసారి. ఈ సినిమాపై అశ్వనీదత్ ఏకంగా రూ.45 కోట్లు పెట్టుబడి పెట్టారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దుల్కర్‌కి సౌత్ ఇండియాలో క్రేజ్ ఉన్న మాట వాస్తవం. కాకపోతే.. రూ.45 కోట్లంటే రిస్కే. ఎందుకంటే… ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకుడు. ఆయన ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో చెప్పలేం. తనపై క్లీన్ ఇమేజ్ ఉంది. లవ్ స్టోరీలు బాగా తీస్తాడని పేరుంది. కానీ… తన సినిమాకి కాసుల వర్షం కురిసి, నిర్మాత భారీ లాభాల్ని మూటగట్టుకోవడం అనేది లేదు. అయినా సరే.. 45 కోట్లు పెట్టేశారు.
హను రాఘవపూడి `పడి పడి లేచె మనసు` ఫ్లాప్ అయ్యింది. ఆ తరవాతి సినిమా లక్కీగా అశ్వనీదత్ బ్యానర్లో పడింది. కథ బాగుంటే, ఎంతైనా ఖర్చు పెడుతుంది వైజయంతీ మూవీస్. చిన్న సినిమానైనా సరే, రిచ్‌గా తీయడం వైజయంతీకి అలవాటే. కథని నమ్మే… ఈ సినిమాపై ఇంత ఖర్చు పెట్టాల్సివచ్చింది. పైగా హను ఈ కథపై యేడాది పాటు కసరత్తు చేశాడట. అశ్వనీదత్ వారుసులు ప్రియాంకా దత్, స్వప్నదత్‌తో పాటు ఓ టీమ్ ఏర్పడి… ఈ కథని, అందులోని సన్నివేశాల్ని ఏడాది పాటు కాచి ఒడబోసి, అన్నీ ఓకే అనుకొన్న తరవాతే… ఈ స్క్రిప్టుని ఫైనలైజ్ చేశారని సమాచారం. పైగా అల్లుడు నాగ అశ్విన్ హ్యాండు ఎలాగూ ఉంటుంది. కాబట్టి.. అంత రిస్క్ చేయడానికి అశ్వనీదత్ వెనుకంజ వేయలేదు. సౌత్‌లో దుల్కర్ మార్కెట్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. అన్ని భాషల్లోనూ నాన్ థియేటరికల్ రైట్స్ రూపంలో దాదాపుగా రూ.25 కోట్లు వచ్చినట్టు సమాచారం. అంటే మరో 20 కోట్లు థియేటర్ నుంచి రాబడితే సరిపోతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతోంది. అన్ని చోట్లా… ఈ సినిమా హిట్ టాక్ సంపాదించుకొంటే వైజయంతీ మూవీస్ మరో జాక్ పాట్ కొట్టినట్టే.