మెగాస్టార్ కెరీర్లో 150 సినిమాలకుపైగానే ఉన్నాయి. హీరోగా నటించినవి చూస్తే అటూ ఇటుగా వందకు తగ్గవు. వీటిలో సీక్వెల్స్కీ, రీమేక్‌కీ తగ్గ కథలు కూడా చాలానే ఉన్నాయి. వాటిలో `జగదేక వీరుడు – అతిలోక సుందరి` ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమాని రీమేక్ చేస్తానని అశ్వనీదత్ ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. చరణ్ – జాన్వీ కపూర్లతో రీమేక్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందని అభిమానుల ఆశ. ఈ ప్రాజెక్ట్ పెండింగ్‌లో ఉంది. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ పై మళ్లీ ఆశలు చిగురింపజేశారు అశ్వనీదత్.
ఇంద్ర ఇటీవల రీ రిలీజ్ అయ్యింది. వసూళ్లు కూడా బాగా వచ్చాయి,. దాంతో ఇంద్ర టీమ్ ఆ జ్ఞాపకాల్ని నెమరు వేసుకొంది. చిరు ఇంట్లో ఓ ములాఖాత్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా `ఇంద్ర`, `జగదేక వీరుడు అతిలోక సుందరి` రీమేక్ ముచ్చట మళ్లీ వచ్చింది. చిరంజీవి రుణం తీర్చుకోలేనిదని, ఇంద్ర, జగదేక వీరుడు సినిమాల్ని మళ్లీ తీసి, ఆయన రుణం తీర్చుకొంటానని అశ్వనీదత్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. `ఇంద్ర` ఆల్ టైమ్ హిట్ సినిమాల్లో ఒకటి. అప్పటి ఇండస్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేసింది. `జగదేక వీరుడు..` ఓ క్లాసిక్. `ఇంద్ర` ఫ్యాక్షన్ స్టోరీ. ఇప్పుడు అలాంటి కథలకు కాలం చెల్లింది. కాబట్టి `ఇంద్ర`ని మినహాయిస్తే `జగదేక వీరుడు..` సీక్వెల్‌పై అశ్వనీదత్ దృష్టి పెడితే మంచిది. ఆయన ఇంట్లో నాగ్ అశ్విన్ లాంటి దర్శకుడు ఉన్నాడు. తన విజన్ ఎలా ఉంటుందో `కల్కి` సినిమాతో అర్థమైంది. నాగ్ అశ్విన్ పూనుకొంటే `జగదేక వీరుడు` సీక్వెల్ పెద్ద కష్టమేం కాదు.