ఆంద్రప్రదేశ్ రాజధానికి అక్టోబర్ 22న మధ్యాహ్నం 12.45గంటలకు ముహూర్తంగా నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేత రాజధానికి శంఖుస్థాపన చేయించబోతున్నారు కనుక ఆయనకు అనువుగా ఉండే విధంగా ఆరోజు మూడు వేర్వేరు సమయాలలో ముహూర్తాలు నిర్ణయించి చివరికి దీనిని ఖాయం చేసినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ చేత రాజధానికి శంఖుస్థాపన చేయించడం చాలా గొప్ప విషయమే. ఆయనకి క్షణం తీరిక లేకపోయినా చంద్రబాబు నాయుడు మాట మన్నించి శంఖుస్థాపనకు వస్తుండటం మెచ్చుకోవలసిన విషయమే. కానీ ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మించడానికి ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ ని బట్టి ముహూర్తం ఖరారు చేయడం ఎంత వరకు సబబు? అని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలనే ఉద్దేశ్యంతోనే
పండితులు ముహూర్తం నిర్ణయిస్తారు. అందుకే ముహూర్తబలం బాగుండాలని అందరూ ఆశిస్తారు. కానీ రాష్ట్రానికి తగిన ముహూర్తం నిర్ణయించే బదులు ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ ని బట్టి ముహూర్తం నిర్ణయించడం చాలా తప్పని చెప్పకతప్పదు.
రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్ తో ముడిపడున్న ఇంతటి భారీ నిర్మాణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తనకు నచ్చిన వ్యక్తితో, నచ్చిన విధంగా ముహూర్తం పెట్టించుకొనే బదులు పండితులని సంప్రదించి వారు సూచించిన ముహూర్తం ఖరారు చేసి ఉండి ఉంటే బాగుండేదని విజయవాడకు చెందిన ఒక వేద పండితుడు అభిప్రాయం వ్యక్తం చేసారు. వాస్తు విజ్ఞాన పరిషత్ కి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లి గూడేనికి చెందిన తల్లావర్జుల శ్రీరామకృష్ణ శర్మ ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తంపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేసారు. “ధనుర్ లగ్నంలో ఉదయం 11.39 గంటలకి రాష్ట్రానికి అన్నివిధాల సరిపోయే ముహూర్తం ఉంది. కానీ దానిని కాదని మకర లగ్నంలో మధ్యాహ్నం 12.45గంటలకి ముహూర్తం నిర్ణయించారు. దాని వలన రాష్ట్రంలో అస్థిరత, అశాంతి నెలకొనే ప్రమాదం ఉంది. ముహూర్తం నిర్ణయించే ముందు రాష్ట్రానికి సంబందించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అందుకు తగ్గట్లు ముహూర్తం నిర్ణయించాలి తప్ప వేరే ఇతర అంశాలను కాదు,” అని అన్నారు.
సాధారణంగా ముహూర్తాలపై పండితులు ఈవిధంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం సహజమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని హితాన్ని కోరే వ్యక్తే! అందులో ఎటువంటి సందేహం లేదు. రాజధాని విషయంలో మొదటి నుండి కూడా ఆయన తన అభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకొంటున్నారు తప్ప ఇంతవరకు ఏ విషయంలోను ఆయన ప్రతిపక్షాలను సంప్రదించలేదు. కనీసం ముహూర్తం విషయంలోనయినా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ వాస్తు, జ్యోతిష్య పండితులను సంప్రదించి ముహూర్తం ఖరారు చేసి ఉండి ఉంటే ఇటువంటి విమర్శలు ఎదురయ్యేవి కావు.