సుశాంత్, ఆది.. ఇద్దరిదీ ఒకే పరిస్థితి. నట వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లే ఇద్దరూ. శుక్రవారం ముందు వరకూ.. విజయాల కోసం ఆవురావురుమంటూ ఉన్నారు. సుశాంత్ చేసిన కాళిదాసు, కరెంట్, అడ్డా… ఈ మూడు సినిమాలూ ఫ్లాపులే. ఈసారి – ఆటాడుకుందాం రా అని పిలిస్తే, ఆది చుట్టాలబ్బాయి వేషం వేసుకొచ్చాడు. వరుసగా నాలుగు ఫ్లాపుల్ని మూటగట్టుకొన్న ఆదిని… చుట్టాలబ్బాయ్ కూడా ఆదుకోలేదు. అలా ఇద్దరినీ ఫ్లాపులు వెక్కిరించాయి. కథల ఎంపికలో ఇద్దరూ పప్పులో కాలేశారు. కామెడీ పండించే దర్శకుల్ని ఎంచుకొన్నా.. కథలో, సినిమాలో కామెడీనే లేకుండా పోయింది. నటన పరంగా ఇద్దరిలో కనిపించిన కొత్తదనం ఏమీ లేకుండా పోయింది. డాన్సులైతే ఇద్దరూ ఇరగ్గొట్టేశారు. ఎలాగైనా సరే జనాల్ని థియేటర్లకు రప్పించాలన్న తాపత్రయం కనిపించింది. అందుకే… నాగచైతన్య, అఖిల్, నాగ సుశీల… వీళ్లందరినీ సుశాంత్ దింపేశాడు. నాగార్జున, నాగేశ్వరరావు, అన్నపూర్ణ స్టూడియోస్ అంటూ అక్కినేని ప్రాపర్టీ మొత్తం వాడేశాడు. ఆది కూడా తన వంతు ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో సాయికుమార్ని లాక్కొచ్చాడు. ఓ ఫ్రేములో తాతయ్యనీచూపించాడు. అలా.. ఈ రెండు సినిమాల్లోనూ `ఫ్యామిలీ` గోల కనిపించింది.
సుశాంత్, ఆది… ఇలాంటి సో కాల్డ్ యంగ్ హీరోలు ఇప్పటికైనా మారాలి. తన స్థాయి తగ్గట్టు కథలు ఎంచుకోవాలి. రొటీన్ కమర్షియల్ సినిమాలు పెద్ద హీరోలకు చెల్లు. ఎందుకంటే వాళ్లేం చేసినా జనం చూస్తారు. యంగ్ హీరోలు మాత్రం తమని తాము నిరూపించుకోవాలంటే శర్వానంద్, నానిల్లా.. కొత్త కథలవైపు దృష్టి పెట్టాలి. లేదంటే ఇలాంటి ఫ్లాపులు తగులుతూనే ఉంటాయి.