తెలుగు సినిమాకు, ప్రేక్షకుడికి అనుసంధానమైనది `అమేజాన్`… తెలుగునాట కొత్తగా విడుదలైన ప్రతి సినిమానూ చూడాలని ఆశించే జనాలు జపిస్తున్న మంత్రమిది. సంక్రాంతికి థియేటర్లలో నవ్వులు పూయించి, నిర్మాతకు వసూళ్ల పంట పండించిన ఎఫ్2 చూడాలా? థియేటర్ వరకూ వెళ్ళాల్సిన పని లేదు. హోమ్ థియేటర్లో ఫుల్ సౌండ్ పెట్టుకుని `అమేజాన్`లో చూసే అవకాశం వుంది. ఎన్టీఆర్ కథానాయకుడు కూడా `అమేజాన్`లో దొరుకుతుంది. సంక్రాంతికి ముందు క్రిస్మస్ సీజన్లో విడుదలైన పడి పడి లేచె మనసు, అంతరిక్షం, కె.జి.యఫ్ చిత్రాలూ `అమేజాన్`లో వున్నాయి.
గడచిన రెండు నెలల్లో విడుదలైన భారీ చిత్రాల్లో వినయ విధేయ రామ, పేట తప్ప మిగతా చిత్రాలు అన్నిటినీ దర్జాగా కాలు మీద కాలేసుకుని ఇంట్లో `అమేజాన్`లో చూడవచ్చు. సినిమా పోస్టర్ మీద `అమేజాన్` లోగో కనబడితే థియేటర్లకు వెళ్లడం ఎందుకు? `అమేజాన్ వుండగా… థియేటర్లకు వెళ్లడం ఎందుకు? థియేటర్లకు వెళ్లి డబ్బులు తగలేయడం దండగ` అని మధ్యతరగతి ప్రేక్షకులు ఆలోచిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకుల ఆలోచనకు ఓ అర్థముంది.
నలుగురు సభ్యులున్న మధ్యతరగతి కుటుంబం ఒక సినిమాకు వెళితే రామారమీ ఐదు వందల రూపాయల నోటు ఖర్చు అవుతుంది. మల్టీప్లెక్స్‌కి వెళితే రెండు వేల రూపాయలు నోటు ఖర్చు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. `అమేజాన్`కి వెయ్యి రూపాయలు కడితే చాలు. మెజార్టీ సినిమాలను విడుదలైన నెల రోజుల తరవాత `అమేజాన్`లో చూడవచ్చు. కొన్ని సినిమాలు రెండు మూడు నెలలకు వస్తున్నాయి. నిర్మాతలు `అమేజాన్`తో చేసుకునే ఒప్పందం మీద ఎన్ని రోజులకు వస్తుందనేది ఆధారపడుతుంది. సినిమా పోస్టర్ మీద `అమేజాన్` లోగో పడితే ఎలాగో వస్తుందని కొందరు థియేటర్లవైపు చూడటం మనుకుంటున్నారు.
`అమేజాన్` మధ్యతరగతి ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా కొంతవరకూ ఆపడంతో ఆగడం లేదు. రిపీట్ ఆడియన్స్ రాకుండా కూడా ప్రభావం చూపుతుంది. నచ్చిన సినిమాను ఒకసారి థియేటర్లో చూసిన వాళ్లు రెండోసారి థియేటర్లకు రావడానికి ఆలోచిస్తున్నారు. వాళ్లకు `అమేజాన్` కనిపిస్తోంది. సినిమాలో నచ్చిన సన్నివేశాలు, పాటలు చూస్తూ.. నచ్చని అంశాలు వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేస్తున్నారు. థియేటర్లకు వెళ్లి మూడు గంటల సమయాన్ని వెచ్చించాల్సిన శ్రమ తప్పుతోంది. హాయిగా ఇంట్లో కూర్చుని చూసే సుఖం దొరుకుతోంది. `అమేజాన్` వల్ల నిర్మాతలకు అదనపు ఆదాయం కొంత లభిస్తుంటే… థియేటర్ల నుంచి లభించే ఆదాయంలో కొంత కోత పడుతోంది.