హిట్టు బొమ్మ పడి చాలా రోజులైంది. వారం వారం సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి తప్ప ఇంపాక్ట్ ఏం చూపించడం లేదు. జనాలకు సినిమాలకు వెళ్లే మూడ్ లేదని పెదవి విరుస్తున్నారే తప్ప, సరైన కంటెంట్ రావడం లేదన్న నిజాన్ని చిత్రసీమ ఒప్పుకోలేకపోతోంది. ‘ఈవారమైనా హిట్ పడుతుందా’ అని బాక్సాఫీస్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. వారాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ వసూళ్ల గలగలలే వినిపించడం లేదు.
ఈవారం బాక్సాఫీసుకు చాలా కీలకం. ఎందుకంటే పంద్రాగస్టుని పురస్కరించుకొని ఏకంగా 4 సినిమాలు వస్తున్నాయి. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్, ఆయ్ చిత్రాలు ఈవారమే విడుదల కాబోతున్నాయి. ఈనాలుగు సినిమాల మధ్య గట్టి పోటీ ఉంది. కానీ లాంగ్ వీకెండ్ ఈసారి ఈ నాలుగు చిత్రాలకూ వరంగా మారే అవకాశం ఉంది. శుక్రవారం సెలవు. శని, ఆదివారాలు వీకెండ్. సోమవారం రాఖీ. సో.. వరుసగా నాలుగు సెలవలు. రోజుకో సినిమా కవర్ చేసినా, నాలుగు సినిమాలూ చూసేయొచ్చు. టాక్ బాగుంటే, జనాలు థియేటర్లు తప్పకుండా వస్తారని నిర్మాతలు భరోసా పెట్టుకొన్నారు.
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ మాస్ సినిమాలు. ఆడియన్ ఛాయిస్ తొలుత ఈ సినిమాలకే. ఆ తరవాత తంగలాన్ పై కూడా దృష్టి పెడతారు. ‘ఆయ్’ ఓ అల్లరి సినిమా. పాటలు బాగున్నాయి. ఆ సినిమా మెల్లగా మౌత్ టాక్ తో ఆడియన్స్ చూపు తన వైపుకు తిప్పుకొంటుందని నిర్మాత బన్నీ వాస్ నమ్మకంగా ఉన్నారు. ఈ నాలుగు సినిమాలు తమదైన శైలిలో ప్రచారాన్ని జోరుగా చేస్తున్నాయి. బాక్సాఫీసు ముందు ఇలా నాలుగైదు సినిమాలు కట్టకట్టుకొని రావడం కొత్త విషయం ఏమీ కాదు. కానీ వరుస సెలవల నేపథ్యంలో ఈవారం ఫోకస్ పెరిగింది. పైగా తెలుగు సినిమాకు ఓ హిట్ చాలా అవసరం. ఈవారమైనా ఆ మాట వినాలన్నది అందరి ఆశ.