జయాపజయాలతో, ట్రాక్ రికార్డులతో సంబంధం లేదు. ప్రతీవారం కొత్త సినిమాలతో థియేటర్లు ముస్తాబైపోతున్నాయి. ఆగస్టు నెలలో కూడా కొత్త సినిమాలు హుషారుగా పలకరించబోతున్నాయి. తొలివారం (ఆగస్టు 2) నుంచీ ఈ హంగామా మొదలు కానుంది. ఈవారం బాక్సాఫీసు ముందుకు ఏకంగా 11 కొత్త సినిమాలు వస్తున్నాయి. అన్నీ చిన్నవే. కానీ ఓసారి లుక్ వేయాల్సినంత స్టఫ్ వీటికి ఉందా? ఏ సినిమా ‘టాక్’ ఏమిటి?
ఈవారం వస్తున్న సినిమాల్లో ‘బడ్డీ’ ఒకటి. ఇదో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్. అల్లు శిరీష్ హీరో. ఈమధ్య శిరీష్ ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. ఎన్నో కథల్ని రిజెక్ట్ చేసిన తరవాత ‘బడ్డీ’ ఎంచుకొన్నాడు. ఈ సినిమా కోసం తొలిసారి తనలోని యాక్షన్ హీరోని బయటకు తీసుకొచ్చినట్టు ట్రైలర్, టీజర్లతో తెలిసిపోతోంది. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమాపై భారీగానే ఖర్చు పెట్టారు. ప్రమోషన్లు కూడా పక్కాగా చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్లు కూడా పడిపోయాయి. టాక్ మాత్రం బాగానే ఉంది. టికెట్ రేట్లు తగ్గించడం ఈ చిత్రబృందం చేసిన మరో మంచి పని.
రాజ్ తరుణ్ నటించిన ఓ సినిమా గత వారం విడుదలైంది. ఇప్పుడు మరో సినిమాని విడుదల చేసేస్తున్నాడు. ‘తిరగబడరాసామి’ ఈ వారమే వస్తోంది. యాక్షన్ ని మేళవించిన కథ ఇది. రాజ్ తరుణ్ తో మాస్ డైలాగులు చెప్పించారు. కథలోని ఎమోషన్ ఆకట్టుకొనేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. రాజ్ తరుణ్‌కి ఈమధ్య టైమ్ అస్సలు బాగోలేదు. ఈ సినిమాతో అయినా తన జాతకం తిరగబడుతుందేమో చూడాలి.
అశ్విన్ బాబు కొత్త సినిమా ‘శివం భజే’ ఈవారం వస్తోంది. అశ్విన్ ముందు నుంచీ డిఫరెంట్ కథలనే ఎంచుకొంటున్నాడు. ట్రైలర్ లో యాక్షన్ పాళ్లు ఎక్కువగా కనిపించాయి. ఇదో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. కాకపోతే శివుడికి సంబంధించిన పాయింట్ కూడా అంతర్లీనంగా ఉన్నట్టు అర్థం అవుతోంది. అది వర్కవుట్ అయితే… ఈ సినిమా నిలబడిపోయినట్టే. ‘ఉషాపరిణయం’, ‘అలనాటి రామచంద్రుడు’, ‘విరాజీ’, ‘తుఫాన్’లాంటి సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. వీటికి ఎన్ని థియేటర్లు దొరుకుతాయో చెప్పలేం. కాకపోతే ఏ థియేటర్ కి వెళ్లినా కొత్త సినిమా పోస్టర్ కనిపించడం మాత్రం ఖాయం.