వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడు అవినాష్ రెడ్డి సీబీఐకి గేమ్స్ ఆడుతున్నారు. తాను వెళ్లి వారి చేతిలో అరెస్ట్ అవడం ఎందుకు వాళ్లే వచ్చి అరెస్ట్ చేయాలన్నట్లుగా కొత్త వ్యూహం పన్నుతున్నారు. సీబీఐ మూడు రోజులు ముందుగా జారీ చేసిన నోటీసులకు.. హాజరవ్వాల్సిన రోజున….ఇదిగో వస్తున్నా.. అదిగో వస్తున్నా అన్నట్లుగా హడావుడి చేసి చివరికి ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల రావట్లేదని లేఖ రాశారు. షార్ట్ నోటీస్ ఇచ్చారని కారణం చూపించారు.
వైఎస్ అవినాష్ రెడ్డి హాజరువుతారని సాక్షి మీడియా ప్రచారం చేసింది. ఆయన నిన్ననే పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చారని కూడా చెప్పుకున్నారు. ఉదయం నుంచి సీబీఐ కార్యాలయం వద్ద పులివెందల నుంచి వచ్చిన అవినాష్ రెడ్డి అనుచరులు గుమికూడారు. అయితే అరెస్ట్ చేస్తారని క్లారిటీ వచ్చిందేమో కానీ చివరి క్షణంలో అవినాష్ రెడ్డి ఆగిపోయారు. తాను విచారణకు రాలేనని మరోనాలుగు రోజుల తర్వాత పిలిస్తే ఆలోచిస్తానని చెప్పారు.
అవినాష్ రెడ్డి అంత బిజీగా ఉన్న కార్యక్రమాలేమిటంటే .. పార్టీ కార్యక్రమాలట. ముందుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉన్నందున రాలేనంటున్నారు. ఆయన లేఖ ఖచ్చితంగా సీబీఐతో గేమ్స్ ఆడటమేనని.. సీబీఐ ఏమీ చేయలేకపోతున్న నిస్సహాయతను ఆయన బయటపెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇలా సీబీఐ నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ కు హాజరు కాకపోవడం ఇదే మొదటి సారి కాదు. దాదాపుగా ప్రతీ సారి ఇదే సమాధానం ఇచ్చారు. కొన్ని సార్లు కోర్టులకు వెళ్లారు. ఈ కారణంగానే అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు చెబుతోంది. ఇప్పుడు అదే మళ్లీ చెబుతున్నారు.
అరెస్ట్ చేయడం ఖాయమని.. ఆ అరెస్ట్ ఏదో సీబీఐ వచ్చి చేసుకుంటే బెటర్ అని.. మనమే వెళ్లి సీబీఐ ముందు అరెస్ట్ కావడం ఎందుకని వచ్చిన రాజకీయ సలాహాలతోనే సీబీఐని అవినాష్ రెడ్డి ధిక్కరిస్తున్నట్లుగా భావిస్తున్నారు.