ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. విచారణ పూర్తైన నేపథ్యం, చార్జ్ షీట్స్ కూడా దర్యాప్తు సంస్థలు వేయటం, సాక్ష్యుల నుండి సమాచారం కూడా ఇప్పటికే సేకరించటంతో పాటు మహిళ అన్న కారణాలు పరిగణలోకి తీసుకుంది సుప్రీంకోర్టు ధర్మాసనం.
ఈడీ-సీబీఐ తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ రాజు… కవిత ఈ కేసులో కింగ్ పిన్ అని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. కవిత కేసులో ఎంత కీ రోల్ ప్లే చేశారో చెప్పేందుకు మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటు అరుణ్ పిళ్లై, బుచ్చిబాబులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ను కోట్ చేశారు.
అయితే, దీనిపై కవిత తరఫున వాదించిన సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ… సిసోడియా వర్తించినవే ఈ కేసులో కవితకు వర్తిస్తాయని, పైగా… అప్రూవర్ గా మారిన వారి స్టేట్మెంట్ ఆధారంగా ఎలా కవితను దోషిగా చూస్తారంటూ ప్రశ్నించారు.
అయితే, ఇది కేవలం బెయిల్ పిటిషన్ మాత్రమేనని… పూర్తిస్థాయి విచారణ కాదని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే సదరు వ్యక్తి జైల్లో ఉన్నారని, విచారణ కూడా పూర్తిచేశారు కాబట్టి ఆమెను విడుదల చేయాలని కోర్టు ఆదేశిస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.