హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇవ్వకుండా అడ్డుకోవటానికి తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఎంత ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రు.5 లక్షల నగదు పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల హామీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు కొడంగల్ నియోజకవర్గం విడిచి వెళ్ళరాదని, పాస్ పోర్ట్ సమర్పించాలని, ఏసీబీ రమ్మన్నపుడు వెళ్ళాలని న్యాయమూర్తి షరతులు విధించారు. ఈ కేసులో ఇతర ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయసింహకుకూడా బెయిల్ మంజూరు చేశారు. కోర్టు తీర్పుపై రేవంత్ కుటుంబ సభ్యులు తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రేవంత్ ఇంటిదగ్గర, చర్లపల్లి జైలువద్ద అతని అనుచరులు సంబరాలు చేసుకున్నారు.
మరోవైపు రేవంత్‌కు బెయిల్ మంజూరు చేయటంపై సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని ఏసీబీ తరపు న్యాయవాది మీడియాకు చెప్పారు. నిందితులు ప్రభుత్వాన్ని కూలదోయలనే కుట్ర చేశారుకనుక వారికి బెయిల్ ఇస్తే ప్రమాదకర పరిణామాలుంటాయని అన్నారు.