ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలుచేశారంటూ పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్కు బెయిల్ మంజూరు అయింది. శుక్రవారమే పట్టాభి బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. సీఆర్పిసి సెక్షన్ 41 కింద పోలీసులు ఇచ్చిన నోటీసు అంశంపై మేజిస్ట్రేట్ సంతృప్తి వ్యక్తం చేయకపోయినప్పటికీ పట్టాభిని రిమాండ్కు పంపారు. సిఆర్పిసి సెక్షన్ 41 ప్రకారం నడుచుకున్నామంటూ పోలీసులు సమర్పించిన పత్రంలో పలు ఖాళీలు ఉండటంపై మెజిస్ట్రేట్ అభ్యంతరం చెప్పారు.
స్టేషన్ బెయిల్ ఇవ్వాలని పట్టాభి తరపు న్యాయవాది కోరినప్పటికీ రిమాండ్కు పంపారు. ఈ అంశంపై హైకోర్టు న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిమాండ్ రిపోర్టుపై సంతృప్తి చెందనప్పటికీ ఎలా రిమాండ్కు పంపుతారనని.. పూర్తి వివరాలు సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ మేరకు రికార్డులను పీపీ సమర్పించారు. వాటిని పరిశీలించిన తర్వాత బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
బుధవారం రోజున ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ పట్టాభిని అరెస్ట్ చేశారు. ఆయనపై ఎవరుఫిర్యాదు చేశారు.. ఏ సెక్షన్లు పెట్టారు.. లాంటి వివరాలేమీ చెప్పలేదు. ఆయనకుటుంబసభ్యులకూ నోటీసులు ఇవ్వలేదు. ఆయన ఇంటిపై దాడి చేసి. ఆయననే అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు పోలీసులపై మండిపడ్డారు.