‘బలగం’ సినిమాతో ఓ స్వీట్ షాక్ ఇచ్చాడు కమెడియన్ వేణు. తాను దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రమది. బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాన్ని అందుకొంది. అవార్డులూ దక్కాయి. వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా? అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు పూర్తిగా దర్శకత్వం వైపే దృష్టి పెట్టాడు వేణు. ‘బలగం’ తరవాత నానితో ఓ సినిమా చేయబోతున్నాడన్న వార్తలు బయటకు వచ్చాయి. నాని – వేణు మధ్య డిస్కర్షన్స్ కూడా జరిగాయి. అయితే.. నాని ఈ సినిమా చేయట్లేదు. తనకున్న కమిట్మెంట్స్ వల్ల వేణు సినిమాని వదులుకోవాల్సివచ్చిందని తెలుస్తోంది. ఆ స్థానంలో మరో హీరోని వెదికి పట్టుకొనే ప్రయత్నాల్లో ఉన్నాడు వేణు. అందులో భాగంగా నితిన్, విశ్వక్‌సేన్‌లను కలిసి ఈ కథ చెప్పాడని తెలుస్తోంది. ఇద్దరికీ ఈ కథ నచ్చింది. అయితే ఈ ఇద్దరిలో ఎవరు వేణుతో జట్టు కడతారన్నది ప్రశ్నార్థకం. నితిన్ ఇప్పుడు ‘తమ్ముడు’ సినిమాతో బిజీగా ఉన్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. విశ్వక్సేన్ చేతిలో దాదాపు 4 సినిమాలున్నాయి. వేణు చెప్పిన కథ నచ్చినా ఇప్పటికిప్పుడు ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లడం కష్టం. మరి విశ్వక్ సేన్ కోసం వేణు మరింత కాలం ఎదురు చూస్తాడా? అనేది చూడాలి. నితిన్ అయితే.. ‘తమ్ముడు’ పూర్తయిన వెంటనే, ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించొచ్చు. కాబట్టి నితిన్వైపే వేణు మొగ్గు చూపిస్తున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నితిన్, విశ్వక్‌లో ఎవరు ఓకే అయినా ఈ ప్రాజెక్ట్ పై బజ్ ఏర్పడడం ఖాయం. `బలగం`లో తెలంగాణ కల్చర్‌ని తెరపై చూపించిన వేణు, ఈసారి మాత్రం పూర్తి స్థాయి కమర్షియల్ కథని ఎంచుకొన్నాడని టాక్.