తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చినట్లుగా నిర్ధారణ అయింది. ఆయన హార్ట్‌లో చాలా వరకూ బ్లాక్స్ ఉండటంతో యాంజియో ప్లాస్ట్ చేసిన వైద్యులు.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించాలని నిర్ణయించినట్లుగా నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. తారకరత్న ఆస్పత్రిలో చేరినప్పటి నుండి బాలకృష్ణ వైద్యం గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో ఉండి.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే ?
నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కోసం కుప్పం వచ్చారు తారకరత్న. పాదయాత్రలో నడుస్తున్న సమయంలో హఠాత్తుగా తూలిపోయారు. వెంటనే వాలంటీర్లు ఆయనను అందుబాటులో ఉన్న కారులో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయనకు పల్స్ పడిపోయిది. శరీరం బ్లూ కలర్లోకి మారిపోయింది. గుండెపోటు లక్షణాలు స్పష్టంగా కనిపించడంతో వైద్యులు సీపీఆర్ చేశారు. నలభై ఐదునిమిషాల తర్వాత పల్స్ వచ్చింది. దీంతో వెంటనే.. మెరుగైన వసతులు ఉన్న పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
యాంజియోప్లాస్టీ చేసిన వైద్యులు !
తారకరత్న పరిస్థితిపై ముందుగానే సమాచారం రావడంతో పీఈఎస్ ఆస్పత్రి వైద్యులు అన్నిరకాల ఏర్పాట్లతో రెడీగా ఉన్నారు. రాగానే అన్ని రకాల లైఫ్ సపోర్టులు పెట్టి.. గుండె నాళాల పరిస్థితిని సమీక్షించారు. అప్పటికప్పుడు యాంజియో ప్లాస్టీ చేశారు. గుండె నాళాల్లో చాలా వరకూ బ్లాక్స్ ను గుర్తించారు. అప్పటికప్పుడు ప్రాణాపాయం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బెంగళూరు తరలించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ సహా కుటుంబసభ్యుల ఫోన్లు
ఆస్పత్రిలో నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్న బాలకృష్ణకు కుటుంబసభ్యులు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలకృష్ణకు ఫోన్ చేశారు. తారకరత్న భార్య.. ఇతర కుటుంబీకులు కూడా బాలకృష్ణకు ఫోన్ చేశారు. ప్రాణానికేం ప్రమాదం లేదని.. గుండెలో తీవ్రమైన సమస్యలు గుర్తించినట్లుగా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.
పీఈఎస్ వైద్యులను ఫాలో అప్ చేసిన చంద్రబాబు
పీఈఎస్ మెజికల్ కాలేజీ వైద్యులతో చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీశారు. మెరుగైన చికిత్స కోసం.. ఎలాంటి సౌకర్యాలనైనా తెప్పించుకోవడమో లేకపోతే.. హెలీ అంబులెన్స్‌లో బెంగళూరుకు అయినా తరలించే విషయంలో వెనుకాడవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది.
మొత్తంగా మొదట తీవ్ర ఉత్కంఠకు గురైన తారకరత్న ఆరోగ్య విషయం.. కాసేపటికి.. నిలకడగా ఉందని తేలడంతో కుటుంబసభ్యులు… టీడీపీ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.