‘తాతమ్మ కల’… నందమూరి బాలకృష్ణ నట ప్రయాణానికి బీజం వేసిన చిత్రమిది. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 50 ఏళ్లు. ఈ చిత్రానికి నందమూరి తారక రామారావు దర్శకుడు. ఆయనే కథని అందించారు. అంతే కాదు. ఇందులో రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు. రమణారెడ్డి, రేలంగి, కాంచన ఇతర పాత్రధారులు. హరికృష్ణ కూడా ఓ పాత్రలో నటించారు. ఈ చిత్రం కొన్ని నెలల పాటు నిషేధానికి గురైంది. పార్లమెంట్‌లోనూ చర్చకు దారి తీసింది.
అప్పట్లో కుటుంబ నియంత్రణను ప్రభుత్వాలు చాలా సీరియస్ గా తీసుకొనేవి. ‘ఇద్దరు ముద్దు ఆ పై వద్దు’ అనే స్లోగన్‌తో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేవి. ‘తాతమ్మ కల’ దీనికి విరుద్ధమైన కాన్సెప్ట్ తో తీసిన సినిమా. పిల్లలు ఎంతమంది అనేది తల్లిదండ్రుల నిర్ణయం, వాళ్ల ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుందన్నది ఎన్టీఆర్ నమ్మకం. దాని ఆధారంగానే ఈ కథ రాశారు. 1974లో షూటింగ్ మొదలైంది. 3 నెలల్లో చిత్రీకరణ పూర్తయ్యింది. అయితే సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కథ, కథనాలు, సంభాషణలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. కొన్ని నెలల పాటు ఈ సినిమా విడుదల కాకుండా నిషేధం విధించింది. అయితే ఎన్టీఆర్ తీవ్ర స్థాయిలో పోరాటం చేసి సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకొని 1974 ఆగస్టు 30న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. విచిత్రం ఏమిటంటే ఏ కథనైతే సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం చెప్పారో, అదే కథకు గానూ ఎన్టీఆర్ నంది పురస్కారాన్ని అందుకొన్నారు. ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు ఈ సినిమాకే సాధించారు ఎన్టీఆర్. అలా బాలకృష్ణ నటించిన తొలి సినిమా సెన్సార్ ఒడిదుడుకుల్ని ఎదుర్కొని, నిషేధం వరకూ వెళ్లి ఎట్టకేలకు విడుదలై, విజయం సాధించడమే కాకుండా, నంది అవార్డు కూడా అందుకొంది.