రెండ్రోజులుగా బాలకృష్ణ పై ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. అది రీమేక్ సినిమా గురించి. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘ఆవేశం’ సినిమాని బాలకృష్ణ రీమేక్ చేయబోతున్నారని, టాలీవుడ్‌లోని ఓ బడా నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకొందని, ఓ యువ దర్శకుడితో బాలయ్య కాంబో సెట్ చేసి, ఈ సినిమా తెలుగులో రీమేక్ చేయబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం.
‘ఆవేశం’ మంచి సినిమానే. బాగా ఆడింది కూడా. అయితే బాలకృష్ణ ఇమేజ్‌కు ఈ కథ సూటవ్వదు. మలయాళంలో ఫహద్ ఫాజల్ చేసిన పాత్ర అది. బాలయ్య ఇమేజ్, ఫహద్ ఫాజల్ ఇమేజ్ రెండూ వేర్వేరు. ఇద్దరికీ మ్యాచ్ అయ్యే ప్రసక్తే లేదు. అలాంటప్పుడు రీమేక్ ఎలా వర్కవుట్ అవుతుందన్నదే ప్రశ్న. బాలయ్య ఫ్యాన్స్ కూడా ‘అంత ఆవేశం వద్దు బాలయ్యా’ అంటూ సోషల్ మీడియా సాక్షిగా రిక్వెస్టులు చేస్తున్నారు.
అయితే నిజానికి బాలయ్య ఈ సినిమా రీమేక్ చేయడానికి ఏమాత్రం సముఖంగా లేడు. ఈ సినిమా అనే కాదు, అసలు రీమేకే చేయకూడదని బాలయ్య నిర్ణయం తీసుకొన్నాడట. తన దగ్గరకు కొత్త దర్శకులు కొత్త కథలతో వస్తున్నారని, అలాంటప్పుడు రీమేకులు చేయడం ఎందుకన్నది బాలయ్య ఉద్దేశం. అదీ నిజమే. ఈమధ్య రీమేక్ సినిమాలు పెద్దగా వర్కవుట్ అవ్వడం లేదు. బాలయ్య లాంటి స్టార్ హీరోలు కొత్త కథలకు పట్టం కట్టాల్సిన సమయం వచ్చింది. అలాంటప్పుడు ఈ రీమేకు గోల ఎందుకు. కాబట్టి… బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ బెంగలేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు.