పౌరాణిక పాత్రలంటే నందమూరి హీరోలే చేయాలి.. అని ప్రేక్షకులు కూడా ఫిక్సయిపోయారు. అన్న ఎన్టీఆర్ బాటలోనే నందమూరి బాలకృష్ణ కూడా పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ‘శ్రీరామరాజ్యం’లో రాముడి పాత్రని అవలీలగా పోషించిన బాలయ్య ఇప్పుడు శ్రీకృష్ణుడి అవతారం ఎత్తబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్.
నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ కథని సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపిస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఆయన ఇందులో కృష్ణుడిగా దర్శనం ఇవ్వబోతున్నారన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ‘హనుమాన్’ సోషల్ కథే అయినా, చివర్లో మైథలాజికల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. సరిగ్గా అదే ఫార్ములా ఈ సినిమాలోనూ పాటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ కథలో సూపర్ హీరో, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయని, చివర్లో బాలయ్య శ్రీకృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరుగుతుందని తెలుస్తోంది. దాదాపుగా స్క్రిప్టు సిద్ధమైపోయిందని, బాలయ్యకు ఓ ఫైనల్ నేరేషన్ ఇస్తే, అంతా సెట్ అయిపోతుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ కూడా రాబోతోంది.