దర్శకుడు బోయపాటి అంటే హీరో బాలయ్యకు అత్యంత సన్నిహితుడు. ఆ మాటకు వస్తే సిఎమ్ చంద్రబాబుకు కూడా. బాలయ్య కు రెండు సూపర్ హిట్ లు ఇచ్చిన దర్శకుడు బోయపాటి. ఇప్పుడు మూడో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వినయ విధేయ రామ సినిమాతో పోయిన పరువు అంతా మళ్లీ ఈ సినిమాతోనే గెయిన్ చేయాల్సి వుంది.
ఈ సినిమా కనుక లేకపోతే బోయపాటికి చాలా కష్టంగా వుంటుంది. అందుకే ముందు 70 కోట్ల బడ్జెట్ అని చెప్పినా, బాలయ్య అంత కుదరదు అనేసరికి 50 కోట్లలోపే చేయడానికి ప్రయత్నిస్తా అంటూ రాజీకి వచ్చారు. ఇప్పుడు ఇంకో విషయంలో కూడా బోయపాటి మాటను నందమూరి బాలకృష్ణ నిర్మాణ సంస్థ ఎన్ బి కె ఫిలింస్ తోసిపుచ్చింది.
విషయం ఏమిటంటే, బోయపాటి జయజానకీనాయక సినిమా చేసినపుడు మాదాపూర్ లో మూడు నాలుగు అంతస్థుల ఆఫీసు ఒకటి తీసారు. ఆఫీసు ఖర్చు సహజంగా నిర్మాతదే. ఆ సినిమాతో ఆ నిర్మాత పాపం గుల్లయిపోయారు. అయినా ఆఫీసు బాగా నచ్చేసింది బోయపాటికి. వినయ విధేయ రామ సినిమా చేసినపుడు అదే ఆఫీసు కంటిన్యూ చేస్తా అన్నారు. నిర్మాత దానయ్య ఓకె అన్నారు. ఆయనే ఖర్చులు భరించారు.
ఇప్పుడు ఎన్ బి కె ఫిలింస్ దగ్గర కూడా బోయపాటి అదే ప్రతిపాదన పెట్టారు. కానీ దానికి ఆ సంస్థ కీలక బాధ్యులు నో అనేసారు. అంత ఖర్చు అనవసరం. ఆల్రెడీ సంస్థ ఆఫీసు వుంది. అది వాడుకోండి. వేరే ఆఫీసు అక్కరలేదు అనేసారు. దాంతో బోయపాటి మారు మాట్లాడలేదు. ఇప్పుడు ఆ ఆఫీసును వేరే సినిమా కంపెనీ వాళ్లు తీసుకుంటున్నారు.