చిత్రసీమలో చాలామంది హీరోలు, దర్శకులు బాలయ్య ఫ్యాన్సు. ఆ పేరెత్తితే చాలు… ‘జై బాలయ్య’ అంటూ పూనకాలు తెచ్చేసుకొంటారు. తమ సినిమాల్లోనూ రిఫరెన్సులుగా బాలయ్యని వాడేసుకొంటారు. అయితే మెగా ఫ్యామిలీ సినిమాలోనూ బాలయ్య రిఫరెన్సులు కనిపించడం, ఆ పేరు వాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Also Read : అల్లు శిరీష్ సినిమా వెనుక అసలు కథ
అల్లు శిరీష్ కొత్త సినిమా ‘బడ్డీ’ ఆగస్టు 2న విడుదల అవుతోంది. ఈ సినిమాలో బాలయ్య రిఫరెన్సులు కనిపించనున్నాయి. ఈ సినిమాలో టెడ్డీబేర్కూ ఓ పాత్ర ఉంది. ఆ పాత్రతో క్లైమాక్స్ లో ‘జై బాలయ్య’ అంటూ పలికించారు. ‘భగవంత్’ కేసరి సినిమాకు సంబంధించిన థీమ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాలో వాడేశారు. మెగా సినిమాలో బాలయ్యని ప్రస్తావించడం, ఆ పేరు వాడుకోవడం షాకింగ్ విషయమే. ఓరకంగా మంచి పరిణామం అనుకోవాలి. ఎందుకంటే.. ఎప్పుడూ సొంత హీరోల్ని స్తుతించడం, వాళ్లని వాడేయడం చూసీ చూసీ ఫ్యాన్స్‌కు బోర్ కొట్టేసింది. కాకపోతే ఇది శిరీష్ సినిమా. తను రిఫరెన్సుల జోలికి వెళ్లడు. ఇంట్లో పాన్ ఇండియా స్టార్ బన్నీ ఉన్నాడు. కావాలంటే తన రిఫరెన్స్ వాడుకోవొచ్చు. కానీ శిరీష్ ఎప్పుడూ అలా చేయలేదు. ఈసారి మాత్రం బాలయ్య నామ జపం చేయడమే వింతగా ఉంది. ఈ సినిమాపై శిరీష్ కాస్త కాన్ఫిడెన్స్ గానే ఉన్నాడు. విడుదలకు రెండు వారాల ముందే ప్రీమియర్ల హడావుడి మొదలైపోయింది. విశాఖపట్నంలో ఆల్రెడీ పెయిడ్ ప్రీమియర్ పడిపోయింది. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రిలోనూ ప్రిమియర్లు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈవారమే ఈ సినిమా విడుదల కావల్సివుంది. కానీ ‘రాయన్’ సినిమా కోసం ఓ వారం వెనక్కి వెళ్లాల్సివచ్చింది.