ఉన్నట్లుండి మీడియా ముందుకు వచ్చారు బాలయ్య చిన్న అల్లుడు భరత్ తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, ఎంపీగా పోటీ చేస్తానని చెప్పేసారు. ఇదే ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఉన్నట్లుండి భరత్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఈ క్లారిటీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్పడం వేరు. ఎన్నికల్లో పోటీకి దిగుతున్నా అని చెప్పడం ఏమిటి?
పైగా ఎంపీకి పోటీ చేస్తా అని ఆయనే ప్రకటించేయడం కూడా. వాస్తవానికి చంద్రబాబు లాంటి పార్టీ నేత దగ్గర ఇలా ప్రకటించడానికి కాస్త సాహసం కావాలి. ఎంత ఫ్యామిలీ మెంబర్ అయినా. ఇప్పటికిప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమి వచ్చింది? అది కూడా టికెట్ ల కేటాయింపు ఇంకా చాలా దూరంలో వుండగానే.
దీని వెనుక వేరే వ్యవహారాలు వున్నట్లు వినిసిస్తోంది. ఎంపీ కంభంపాటి హరిబాబు తెలుగుదేశం పార్టీలోకి వస్తారని వినిపిస్తోంది. ఆయన భాజపాలో ఎంపీగా వున్నారు. మళ్లీ అదే పార్టీ టికెట్ పై పోటీ చేసి, గెలిచే అవకాశం నూటికి నూరు పాళ్లు లేదు. అందుకే పార్టీ మారి, తెలుగుదేశం పార్టీలోకి వస్తారని వినిపిస్తోంది.
మరోపక్క బాలయ్య అల్లుడు భరత్ గత కొన్ని నెలలుగా ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నారన్న వార్తలు అయితే వున్నాయి. ఇలాంటి టైమ్ లో కంభంపాటి సడెన్ గా బాబు ఢిల్లీ ధీక్షలో ప్రత్యక్షమయ్యారు. దాంతో ఆయన రాక పక్కా అని, ఎంపీకి ఈసారి తెలుగుదేశం టికెట్ పై పోటీ చేస్తారని అనుమానాలు స్టార్ట్ అయ్యాయి.
అందుకే భరత్ అలెర్ట్ అయినట్లున్నారు. తనకు తానే తన అభిలాషనుు ముందుగా ప్రకటించేసారు. ఇప్పుడు కంభంపాటి హరిబాబు తన ప్లానింగ్ లో మార్పులు చేసుకునే అవకాశం వుంటుంది. ఇలా అలెర్ట్ చేయడం కోసమే భరత్ తన మనసులోని మాటను బయటపెట్టినట్లు భావించాల్సి వస్తోంది.
పార్టీ విధేయతను భరత్ తన మాటల్లో ప్రస్తావించారు. పార్టీ అనుమతిస్తేనే అన్నారు. మరి అలాంటి నేపథ్యంలో ఈ ఓపెన్ ప్రకటన ఎందుకు? తన మనసులోని మాట పార్టీ అధినేతకు చెబితే సరిపోతుంది కదా? కానీ అలా చేయకుండా ఇలా ఓపెన్ అవ్వడం అంటే విశాఖ లోక్ సభ స్థానం ఆశిస్తున్నవారికి ముందస్తు సమాచారం ఇవ్వడం కోసమే అనుకోవాలి.
బాలయ్య అల్లుడు, లోకేష్ తొడల్లుడు కాబట్టి, అతనికే ప్రయారిటీ వుంటుందని, అదే టికెట్ ను ఆశించేవారు వెనక్కు తగ్గుతారని ఇలా వ్యూహరచన చేసారేమో? ఏమయినా కంభంపాటి హరిబాబును పార్టీలోకి తీసుకోవాలని కానీ, టికెట్ ఇవ్వాలని కానీ అనుకుంటే భరత్ ఇలాంటి వ్యూహరచనలు చేసి ప్రయోజనం వుండదు. అందువల్ల తన కోరిను చంద్రబాబు వైపు నుంచి నరుక్కరావడం ముఖ్యం అని భరత్ గమనించాలి.