మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక విమానంలో రష్యా వెళ్తున్న ఫోటోలు పెట్టడం రాజకీయ రచ్చకు కారణం అయింది. అయితే ఆ ఫోటో వెనుక కథ ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. ప్రజల డబ్బు, అవినీతి డబ్బుతో జల్సా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించడంతో మంత్రి బాలినేని తాను ఒక్కడినే స్పెషల్ ఫ్లైట్‌లో లేనని.. తనతో పాటు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా ఉన్నారని ప్రకటించారు. దీంతో టీడీపీ వర్గాల్లోనూ ఈ అంశం కలకలం ప్రారంభమయింది. బాలినేని, అనగాని కాకుండా మొత్తం పదిహేడు మంది రష్యాలో ఓ బడా వ్యక్తి బర్త్ డే పార్టీకి వెళ్లినట్లుగా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బాలినేని సహా రష్యా వెళ్లిన పదిహేడు మంది రాజకీయ నేతలే. ఒక్క వైసీపీ వాళ్లే కాకుండా అన్ని పార్టీల కీలక నేతలూ ఆ స్పెషల్ ఫ్లైట్‌లో రష్యాకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీ కాబట్టి సహజంగా వైసీపీ నేతలే ఎక్కువ ఉంటారు. అయితే ప్రయాణ చార్జీలకే కోట్లు పెట్టి తీసుకెళ్లిన ఆ బడా వ్యక్తి రష్యాలో పార్టీల కోసం ఇంకెంత ఖర్చు పెట్టారోఅన్నది ఊహించడం కష్టం. అయితే అసలు ఆ బర్త్ డే పార్టీ ఎవరిది..? ఎందుకింత గ్రాండ్‌గా చేసుకున్నారు..? ఆ సొమ్మంతా ఎలా సంపాదించారు? అన్నది ఇప్పుడు అటు వైసీపీలోనూ ఇటు టీడీపీలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా ఇలాంటి పార్టీలు ప్రభుత్వంతో బాగా మేలు జరిగిన వాళ్లు మాత్రమే ఇస్తారు. ఇక్కడ కూడా అలాంటి వ్యక్తి బర్త్ డే పార్టీనే జరిగిందని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెంది.. గ్రానైట్ వ్యాపారంలో ఇటీవలి కాలంలో వందల కోట్లు వెనకేసుకున్న వ్యక్తి ఈ జల్సాలకు ప్రధాన పోషకుడిగా భావిస్తున్నారు. ఆయన తెలివిగలవారు కాబట్టే అన్ని పార్టీల నేతలనూ కలుపుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం బాలినేని ఫోటోతో విషయం కొద్ది కొద్దిగా బయటకు వచ్చింది. ముందు ముందు ఆ స్పెషల్ ఫ్లైట్‌లో రష్యాకు వెళ్లిన పదిహేడు మంది ఎవరు .. అక్కడ ఏం చేశారు అన్నవి మెల్లగా బయటకు వచ్చే అవకాశం ఉంది.