బాలినేని శ్రీనివాస్ రెడ్డి… వైసీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా… పార్టీలో రెబల్. పార్టీని డైరెక్టుగా కామెంట్ చేయటమే కాదు, పార్టీ తప్పులను ఓపెన్ గా చెప్తుంటారు.
ఒంగోలులో ఓటమి తర్వాత బాలినేని పార్టీ మారుతారని, ఆయన జనసేనలోకి వెళ్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. వైసీపీతో ఎన్నికలకు ముందు నుండే అంటీముట్టనట్లుగా ఉంటున్న బాలినేని, ఇప్పుడు పార్టీ మార్పు ఖాయం అన్నది ఆ ప్రచార సారాంశం.
అయితే, పార్టీ మార్పుపై తనదైన శైలీలో స్పందించారు బాలినేని. తాను పార్టీ మారాలని మా పార్టీ వారే కోరుకుంటున్నట్లున్నారు… పార్టీ నన్ను పట్టించుకోవటం లేదని కామెంట్ చేశారు. ఎన్నికలు అయిపోయిన నాటి నుండి నేను పార్టీకి దూరంగా ఉంటున్నానని, ఈవీఎంలపై నేను చేస్తున్న పోరాటాన్ని పార్టీ పట్టించుకుంటలేదని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ పట్టించుకున్నా, పట్టించుకోకున్నా తన పోరాటం ఆగదన్న బాలినేని… నాకు ప్రజలున్నారు. ప్రజల అండగా పోరాడుతానని ప్రకటించారు. నేను పార్టీ మారే ఆలోచన లేకున్నా, మా పార్టీ నేతలకు ఉన్నట్లుందని కామెంట్ చేయటం కొసమెరుపు.
దీంతో, ఇప్పుడు బాలినేనికి పొగపెడుతున్నదెవరు? బాలినేనికి- వైవీ సుబ్బారెడ్డికి ఉన్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందా…? జగన్ బాలినేనిని పూర్తిగా పక్కకు పెట్టారా? వంటి ప్రశ్నలతో వైసీపీ శ్రేణులు గందరగోళంలో పడిపోయాయి.