బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఆయనను జగన్ రెడ్డి వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తున్నారు. తాజాగా ఆయన అనుచరుల్ని పార్టీ నుంచి గెంటేశారు. బాలినేని ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వీరిద్దరూ పర్చూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరి్సతూ ఉంటారు. బాలినేనికి సమాచారం ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ఆయన పార్టీ నేతలపై మండిపడ్డారు. 48 గంటల్లో తన అనుచరులను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఈ అంశంపై బాలినేని చర్చించే అవకాశం ఉందని చెపుతున్నారు. అయితే ముఖ్యమంత్రికి తెలియకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరని.. అంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాపై బాలినేని ప్రభావం ఏమీ ఉండదని చెప్పేందుకు ఈ సంకేతాలు పంపారని అంటున్నారు.
ఇటీవల విజయసాయిరెడ్డి ఈజిల్లాకు ఇంచార్జ్ గా వచ్చారు. ఆ సమయంలో బాలినేనికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆయనే జిల్లాను చూసుకోవాలన్నట్లుగా మాట్లాడారు. కానీ జరుగుతోంది మాత్రం రివర్స్‌లో . ఈ కారణంగా బాలినేనిలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇప్పటికే ఆయనకు గేటుచూపించారని కానీ బాలినేనే గేటును పట్టుకుని వేలాడుతున్నారని ఆయన అనుచరులు సెటైర్లు వేసుకుంటున్నారు.