రాజకీయాల్లో ఊహాగానాలు, పుకార్లు …కీలక పరిణామాలకు కారణం అవుతాయి. సొంత పార్టీ నేతలపై .. అగ్ర నేతల్లో అపనమ్మకం పెంచడమే వీటి లక్ష్యం. ఇలాంటివి సక్సెస్ అయితే… నమ్మకస్తుల్ని ఆయా పార్టీల నేతలు కోల్పోతారు. వారంతా… ప్రత్యర్థి పార్టీలో చేరిపోతారు. ఇలాంటి వ్యూహాన్ని ఇప్పుడు.. బండి సంజయ్ చాలా దూకుడుగా టీఆర్ఎస్ పై ప్రయోగిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు..తమతో టచ్‌లోఉన్నారని చెప్పడమే కాదు… తమ పార్టీలో చేరడానికి ఇష్టం లేని వాళ్లు సొంత పార్టీలు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారన్న ప్రకటనలు చేస్తున్నారు. బండి సంజయ్ ప్రకటనలు సహజంగానే చర్చనీయాంశం అవుతున్నాయి. బీజేపీతో టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు..? పార్టీ పెట్టడానికిసిద్ధమవుతున్న ఎమ్మెల్యేలు ఎవరు..? అంటూ టీఆర్ఎస్లోనే చర్చ జరిగేలా చేస్తున్నారు.
ప్రస్తుతం బండి సంజయ్.. ఖమ్మం, వరంగల్ మధ్య చక్కర్లు కొడుతున్నారు. అక్కడ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లి.. టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల గురించిమాట్లాడుతున్నారు. కేటీఆర్‌ను సీఎం చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదని కూడా బండి సంజయ్ చెప్పుకొచ్చారు. పార్టీలో చీలికలు వస్తాయని కేటీఆర్‌కు చెబుతున్నారని ఆయన అంటున్నారు. అలాగే మంత్రి పదవులు రాకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది అసంతృప్తితో ఉన్నారని.. వచ్చే ఎన్నికల నాటికి గంపగుత్తగా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి దూకుతారని ప్రకటిస్తున్నారు.
టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరకుండా.. ఆ పార్టీ అధినేత ప్లాన్ చేసుకుంటున్నారు. అందర్నీ బుజ్జగిస్తున్నారు. పార్టీకి అవసరం లేకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా… చూసుకుంటున్నారు. అధికార పార్టీగా.. ఆ అడ్వాంటేజ్.. టీఆర్ఎస్కు ఉంది. అయితే.. ఎంత ఎక్కువగా టీఆర్ఎస్ లో అసంతృప్తి ఉందనే ప్రచారం చేస్తే అంత మంచిదని బీజేపీ భావిస్తోంది. ఆ దిశగా… మైండ్ గేమ్ ను బండి సంజయ్ దూకుడుగానే నిర్వహిస్తున్నారు.