రేవంత్ రెడ్డికి బండి సంజయ్ మద్దతిచ్చారు. అమెరికాలో రేవంత్ రెడ్డి పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్న ఓ కంపెనీని ఆయన సోదరుడు పెట్టారని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఆయన తమ్ముడు కోసమే అమెరికా వెళ్లారని పెట్టుబడులన్నీ బోగస్ అంటోంది. దీనిపై కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చుకోవడానికి తంటాలు పడుతోంది. చివరికి జయేష్ రంజన్ తోనూ వీడియోలు విడుదల చేయించాల్సి వచ్చింది. అనూహ్యంగా ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి రేవంత్ కు మద్దతు లభించింది.
హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన బండి సంజయ్ .. రేవంత్ అమెరికా పర్యటనపై ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు చేయాలంటే ఓ పద్దతి ఉంటుందని బీఆర్ఎస్ కు హితవు పలికారు. రేవంత్ కు ఇంత బాగా మద్దతు పలికే బీజేపీ నేత మరొకరు కనిపించరు. కానీ ఆ తర్వాత బండి సంజయ్ మరో మాట కూడా చెప్పారు.. అదేమిటంటే.. కేటీఆర్ అరెస్టు గురించి. కేటీఆర్ ను రేవంత్ సర్కార్ అరెస్టు చేసి తీరుతుందని తన నమ్మకం అన్నారు.
పోలీసుల్ని ఉపయోగించుకుని రేవంత్ ను.. తనను వేధించినట్లుగా ఇంకెవర్నీ వేధించలేదని ఇవన్నీ రేవంత్ కు గుర్తుండే ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. అంటే.. తనపై జరిగిన రాజకీయదాడులకు ప్రతీకారం.. రేవంత్ తీర్చాలని ఆయన పరోక్షంగా కోరుతున్నారు. అది రేవంత్ ప్రతీకారం కూడా అని ఆయన అంటున్నారు. రేవంత్ విశ్వాసం కోల్పోతే అప్పుడు ఆలోచిస్తానని అంటున్నారు. మరి రేవంత్.. బండి సంజయ్ కోరిక తీరుస్తారో లేదో ?