పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చాలా మంది జీవితాలు మార్చింది. ఈ సినిమాతో హరీష్ శంకర్ టాప్ లీగ్ డైరెక్టర్ అయ్యారు. అప్పటివరకూ చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే బండ్ల గణేష్ ఏకంగా బ్లాక్ బస్టర్ నిర్మాత అయిపోయారు. నిర్మాతగా పాతిక హిట్లు తీసినా రానంత పేరు ఈ ఒక్క సినిమాకే వచ్చేసింది.
అయితే నిర్మాతగా బండ్ల గణేష్ గత ఏడేళ్ళుగా సైలెంట్ అయిపోయారు. ఆయన నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. కానీ తాజాగా గబ్బర్ సింగ్ రీరిలీజ్ సందర్భంగా మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. ఈసారి ఆసక్తికరమైన ప్రకటనే చేశారు. ఇకపై వరుస సినిమాలు చేస్తానని, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ ఇస్తానని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.
బండ్ల ఉత్సాహం బాగానే వుంది. ఐతే ఆయనకి ఎలాంటి హీరోలు దొరుకుతారనే ప్రశ్న. ఏదో రకంగా బతిమాలి పవన్ కళ్యాణ్ ని ఒప్పిద్దామంటే ఆయన రాజకీయాల్లో బిజీగా వున్నారు. ఎన్టీఆర్ తో బాద్షా, టెంపర్ లాంటి సినిమాలు తీశారు బండ్ల. ఆయనతో వున్న పరిచయంతో సినిమా అడుగుదామంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ క్యూలైన్ చాలా పెద్దగా వుంది. ఇక అల్లు అర్జున్ ఇప్పుడంతా పాన్ ఇండియా లీగ్ లో వున్నారు. ఆయన నెక్స్ట్ హారిక హాసినిలో దాదాపు ఖరారయ్యేలా వుంది.
రామ్ చరణ్ తో చేసిన గోవిందుడు అందరివాడేలే బండ్లని చాలా నిరాశ పరిచింది. ఆ రకంగా చరణ్ మరో సినిమా అవకాశం ఇస్తాడని అనుకున్నా .. మరో మూడేళ్ళ వరకూ చరణ్ డేట్లు కూడా ఖాళీగా లేవు. ఈ ఏడేళ్ళ గ్యాప్ లో రాజకీయాల్లో పడి హీరోలతో టచ్ కోల్పోయారు బండ్ల. ఇప్పటికిప్పుడు బడా హీరోతో సినిమా సెట్ చేసుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. టైర్ 2 హీరోలైనా బండ్లతో సినిమాలు తీస్తారా? అనేది పెద్ద ప్రశ్న. ఆ మధ్య తమిళ హీరో సచిన్.. బండ్లపై చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. బండ్ల మోసగాడని, తన వల్ల చాలా మోసపోయానని సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్ల ఎప్పుడు ఎవరితో ఎలా వ్యవహరిస్తాడో ఎవరికీ తెలీదు. అందుకే ఏ హీరో అయినా బండ్ల పేరు చెబితే కాస్త ఆలోచిస్తాడు. ఇలాంటి పరిస్థితిల్లో బండ్ల గణేష్ ఏం చేస్తాడో చూడాలి.