సాధారణ ప్రజలు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకున్నారు. అందులో వెయ్యి ఉంచుకోవడం కూడా కష్టమే. ఆ వెయ్యి దేనికైనా ఉపయోగపడతాయని డ్రా చేసుకుంటారు. కానీ బ్యాంకుల్లో డబ్బులు ఉంచనందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంతగా అంటే.. వేల కోట్లలోనే. గత ఐదేళ్లలో బ్యాంకు ఖాతాల్లో కనీస మొత్తం లేదని వసూలు చేసిన మొత్తం రూ. ఎనిమిన్నదర వేల కోట్లు. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా తెలిపింది.
బ్యాంకింగ్ సేవలు ఎంత కాస్ట్లీగా మారుతున్నాయన్నదానికి ఈ అంకెలే సాక్ష్యాలు. ఇది ఒక్క మినిమం బ్యాలెన్స్ నిర్వహించనందుకు చార్జీ మాత్రమే. ఇక ఏటీఎం చార్జీల లెక్క చెబితే ప్రజలు ఎంత దారుణంగా బ్యాంకుల వల్ల దోపిడీకి గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి వీరంతా ఎవరు ?. బ్యాంక్ బ్యలెన్స్ కూడా నిర్వహించలేనంత ప్రజలు. ఖాతాలు ఓపెన్ చేసి.. అలా వదిలేసే వాళ్లు కాదు. అలా వదిలేస్తే.. డబ్బులు వసూలు చేసే అవకాశం ఉండదు. కానీ ఎప్పుడో ఏదో… డబ్బులు వచ్చి… తన అకౌంట్లో డబ్బులు పడితే ఆటోమేటిక్ గా బకాయి అంటూ… బ్యాలెన్స్ నిర్వహించనందుకు అయిన ఖర్చును బ్యాంకులు లాగేసుకుంటాయి. ఇలాంటి అనుభవం ఎతో మంది పేదవారికి ఉంటుంది.
జీరో బ్యాలెన్స్ పేరుతో కోట్ల ఖాతాలు ప్రారంభించారు. ఆ ఖాతాలనూ వదిలి పెట్టడం లేదు. చివరికి డ్వాక్రా మహిళలకు లోన్లు ఇచ్చేందుకు ఓపెన్ చేసే ఖాతాల్లోనూ కనీసం వెయ్యి రూపాయలు లేకపోతే చార్జీలు వసూలు చేస్తున్నారు. పెన్షన్ కోసం వృద్ధులు ప్రారంభించుకున్న ఖాతాలపైనా అదే ప్రతాపం చూపుతున్నారు. అంటే.. బ్యాంకులు వసూలు చేస్తున్న ఆ వేల కోట్లు.. పేదలవే. మినిమం బ్యాలెన్స్ కూడా నిర్వహించలేని పేదలు పొరపాటున ఎప్పుడైనా అకౌంట్లో డబ్బులు వేస్తే… బలవంతంగా తీసుకున్నవే. ఈ పాపం బ్యాంకులదే.