2002 గుజరాత్ అల్లర్లు, ఆ ఉదంతంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీ సోషల్ మీడియాలో కనిపించకుండా ప్రభుత్వం బ్యాన్ చేసింది. అల్లర్లకు మోదీనే బాధ్యుడని బ్రిటన్ ప్రభుత్వ రహస్య విచారణలో తేలిందని బీబీసీ తేల్చింది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరిట రూపొందించిన రెండు భాగాల్లో మొదటి ఎపిసోడ్‌ను గురువారం యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది. అయితే, అప్లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే కేంద్ర ఐటీశాఖ ఈ వీడియోను తొలగించింది. ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేయడానికి, ప్రచారంలో భాగంగానే బీబీసీ ఈ డాక్యుమెంటరీ తీసుకొచ్చిందని కేంద్రం ఆరోపించింది.
ఈ బీబీసీ డాక్యుమెంటరీ లింక్‌లను తీసివేయాలనిట్విట్టర్ , యూట్యూబ్‌లను కూడా కేంద్రం ఆదేశించింది. కేంద్రం ఆదేశాల ప్రకారం “ఇండియా: ది మోడీ క్వశ్చన్” అనే డాక్యుమెంటరీకి సంబంధించిన అనేక ట్వీట్లు మరియు యూట్యూబ్ వీడియోలు ఇకపై మైక్రోబ్లాగింగ్ మరియు వీడియో-షేరింగ్ వెబ్సైట్లలో కనిపించడం లేదు. నేరుగా బీబీసీకే కేంద్రం తన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే బీబీసీ మాత్రం చాలా లోతుగా అధ్యయనం చేసి ఆ డాక్యుమెంటరీ తీసినట్లు స్పష్టం చేసింది.
ఆ బీబీసీలో ఎంత నిజాలున్నాయో.. ఎన్ని అబద్దాలున్నాయో ప్రజలు తెలుసుకోకుండా కేంద్రమే చేయడం ఆశ్చర్యకరంగా మారింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టక ముందు ప్రపంచంలో ఆయన ఇమేజ్ చాలా తేడాగా ఉండేది. ఆయనకు ప్రపంచంలోని ప్రముఖ దేశాలు వీసాలు ఇచ్చేవి కావు. అయితే ఆ ఆల్లర్లలో ఆయన పాత్ర లేదని ఇటీవలే కేంద్ర దర్యాప్తులు సంస్థలు తేల్చాయి. కానీ అంతర్జాతీయ సమాజం మాత్రం నమ్మడం లేదు. ప్రభుత్వాల రహస్య విచారణల్లో.. ఆయన పాత్ర తేలిందని బీబీసీ లాంటి వేదికలు ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీని నిషేధించడం వల్ల…. దీని గురించి మరింత విస్తృత ప్రచారం జరిగే అవకాశాన్ని కేంద్రమే కల్పించినట్లయింది.