56 బీసీ కులాలకు కార్పొరేషన్లు పెట్టేశామని పదవుల ప్రకటన చేసేస్తున్నామని ప్రకటించిన వైసీపీ పెద్దలకు… చివరికి ఆ జాబితాను ప్రకటించలేకపోయారు. పార్టీ నేతల నుంచి జాబితాలో మార్పు చేర్పులకు తీవ్రమైన ఒత్తిడి రావడం ఓ కారణం అయితే… జాబితా ప్రకటించకముందే బయటపడిన అసంతృప్తి మరో కారణం. వైసీపీలో పదవుల కోసం భారీగా పోటీ ఉంది. బీసీ కార్పొరేషన్లకు తమ తమ అనుచరులకే పదవులు ఇవ్వాలంటూ.. నియోజవర్గ స్థాయి నుంచి మంత్రుల వరకూ.. సిఫార్సులు చేశారు. మొత్తంగా పదవుల పంపకం.. నలుగురు రెడ్డి నేతల చేతుల మీదుగా సాగింది. వీరందరూ కలిసి పదవులను ఎంపిక చేశారు.
కానీ పేరు మాత్రం.. పార్టీ బీసీ విభాగ అధ్యక్షుడు జంగాకృష్ణమూర్తి పేరుది. ఆయన తన అనుచరులు… పార్టీ కోసం కష్టపడిన వారు కొంత మందిని లిస్టవుట్ చేసుకుంటే.. దానికీ ఆమోదముద్ర పడలేదు. అనేకానేక కసరత్తులు చేసి… జాబితాను సిద్దం చేశారు. పార్టీ నేతలకు ముందస్తు గా సమాచారం వెళ్లడంతో గగ్గోలు ప్రారంభమయింది. పదుల సంఖ్యలో నేతలు.. తమ పదవుల సంగతేమిటని ప్రశ్నించడం ప్రారంభించారు. కొంత మంది కొత్తగా పార్టీలో చేరిన వారి ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంది. తాము చెప్పిన వారికి పదవులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అలా ఇస్తే జిల్లాల సమతూకం దెబ్బతింటోంది. చివరికి ఓ కులానికి మరో కులం వ్యక్తిని చైర్మన్గా ఖరారు చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ గందరగోళం నడుమ జాబితా విడుదలను ఆపాలని నిర్ణయించుకున్నారు.
ఎంత ఎక్కువగా ఎవరు ఒత్తిడి చేస్తారో వారి పేర్లను ఉంచి… ఇప్పటికే ఖరారు చేసిన కొన్ని పేర్లను తొలగించి.. నేడో రేపో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత అసలు రాజకీయం ప్రారంభమవుతుందని అంటున్నారు. కార్పొరేషన్లకు కార్యాలయాలు, విధులు, నిధులు ఉండాలని.. వారు ఆ తర్వాత డిమాండ్ చేస్తారు. అప్పుడు మరింత అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పదవులు ఇవ్వగలరు కానీ… ఎలాంటి నిధులు కేటాయించే అవకాశం లేదు. పథకాలకు పెట్టే ఖర్చులు ఆయా కార్పొరేషన్ల ఖాతాలో మాత్రం చూపిస్తారు.