తాజ్ మహాల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలిలెవరోయ్… అన్న మాట చాలా సందర్బాల్లో గుర్తుకొస్తుంది. కిందిస్థాయిలో కష్టపడి పనిచేసే వారిని గుర్తించటం, గౌరవించటం కార్పోరేట్ వ్యవస్థలో మూలన పడిపోయింది. కానీ, ఈసారి ఐపీఎల్ లో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వావ్ అనిపిస్తుంది.
అవును… వర్షం పడినా, వాతావరణం ఎలా ఉన్నా, మ్యాచ్ టైంకు పిచ్ ను సిద్ధం చేసే గ్రౌండ్ మెన్స్ తో పాటు క్యూరెటర్స్, స్టాప్ పడే కష్టం అంతా ఇంతా కాదు. ఏ మాత్రం తేడా వచ్చిన మొదటి వేటు వారిపైనే. కాస్త అటూ ఇటూ అయినా ఫ్యాన్స్ సహా అందరూ దుమ్మెత్తిపోసే వారే.
ఐపీఎల్ లో ఓడినా, గెలిచినా కోట్లలో టర్నోవర్. ఆటగాళ్ల నుండి సపోర్టింగ్ స్టాఫ్ వరకు భారీగా ఫీజులొస్తాయి. ఫ్రాంచైజీ ఓనర్లకు స్పాన్సర్స్ రూపంలో డబ్బులే డబ్బులు. ఇటు బోర్డుకు కూడా కోట్లలో లాభాలు. అయితే, ఇందులో నుండి కొంత ఇప్పుడు గ్రాండ్ స్టాఫ్ కు కూడా ఇవ్వనున్నారు.
10వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. విశాఖ సహా మరో మూడు వేదికల్లో కొన్ని మ్యాచులు జరిగాయి. రెగ్యూలర్ గా ఉన్న 10 వేదికల్లో క్యూరెటర్స్ తో పాటు గ్రౌండ్ స్టాఫ్ అందరికీ ఒక్కొక్కరికి 25లక్షల చొప్పున ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఎంతో శ్రమించిన అన్సంగ్ హీరోస్ వారు… వారికి గౌరవంగా ఇవ్వాలనుకుంటున్నాము అని బీసీసీఐ సెక్రెటరీ జైషా ప్రకటించారు. కొన్ని మ్యాచులే జరిగిన వేదికల్లో పనిచేసిన వారికి 10లక్షల చొప్పున ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
కాసుల వేటలో బీసీసీఐ అని ఎన్ని విమర్శలున్నా, అప్పుడప్పుడు తీసుకునే ఇలాంటి నిర్ణయాలు బోర్డుకు మంచి పేరు తెస్తుంటాయి.