గత రెండు నెలలుగా టాలీవుడ్ కొత్త సినిమాలతో హోరెత్తిపోయింది. ప్రతీ వారం రెండు మూడు సినిమాలైనా వచ్చేవి. ఒక్కోసారి ఏకంగా ఏడెనిమిది సినిమాలు వచ్చిన దాఖాలు కూడా ఉన్నాయి. అయితే.. ఈవారం తెలుగు సినిమా ఒక్కటీ విడుదల కావడం లేదు. వచ్చేవి రెండూ డబ్బింగు బొమ్మలే. ఒకటి బీస్ట్ అయితే మరోటి కేజీఎఫ్ 2.
విజయ్ నటించిన సినిమా బీస్ట్ ఈనెల 13న వస్తోంది. ఇంతకు ముందు లేదు గానీ, ఈమధ్య విజయ్‌కి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. తుపాకీ, సర్కార్, మాస్టర్ సినిమాలు టాలీవుడ్ లో చక్కటి వసూళ్లు దక్కించుకున్నాయి. పైగా ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా ఉంది. అన్నింటికంటే మించి, ఈమధ్య కాలంలో ప్రాంతీయ భాషా చిత్రాలు రాజ్యమేలుతున్నాయి. సరిహద్దుల్ని చెరిపేస్తూ వినోదం పంచిస్తున్నాయి. తెలుగులోనూ బీస్ట్ భారీ సంఖ్యలో థియేటర్లకు సంపాదించుకుంది. తెలుగులో ఓ స్టార్ హీరో సినిమాకి ఎంత పెద్ద ఓపెనింగ్ ఉండబోతోందో, దానికి కొంచెం కూడా తగ్గకుండా… విజయ్ సినిమా ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు గడుతున్నాయి.
14న కేజీఎఫ్ 2 సినిమా విడుదల అవుతోంది. అవ్వడానికి ఇది కన్నడ సినిమానే అయినా – అసలు సిసలు పాన్ ఇండియా సినిమా. కేజీఎఫ్ 1 దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. బాహుబలి తరవాత. ఆ స్థాయిలో బాలీవుడ్ ని షేక్ చేసిన సినిమా ఇది. ఇప్పుడు కేజీఎఫ్ 2పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్ ఇండియా స్థాయిలో, ఓపెనింగ్ డేన.. కొత్త రికార్డులు సృష్టించే సత్తా కేజీఎఫ్ 2కి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బీస్ట్, కేజీఎఫ్ 2 డబ్బింగ్ సినిమాలే కావొచ్చు. కానీ స్ట్రయిట్ సినిమాకి ఉండే మైలేజీ వీటికి ఉంది. ఆర్.ఆర్.ఆర్ తరవాత బాక్సాఫీసు దగ్గర నిలబడి, గట్టిగా వసూళ్లు సాధించిన సినిమా ఏదీ రాలేదు. ఈ రెండింటికీ ఆ ఆస్కారం ఉంది. రెండూ భారీ వసూళ్లతో హోరెత్తిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఓమాటలో చెప్పాలంటే ఈ వారం సౌత్ ఇండియన్ సినిమాకి చాలా చాలా కీలకం.