కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకరరెడ్డి ఆత్మహత్యను వెనువెంటనే బ్యూటిషియన్ శిరీష ఆత్మహత్యతో ముడిపెట్టారు పోలీసులు. దీనిపై శరవేగంగా విచారణ జరిపి వివరాలు పూసగుచ్చినట్టు వెల్లడించారు. కనీసమైన సందేహాలు గాని తేలవలసిన విషయాలు గాని అసలు లేవన్నట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి ప్రకటించారు. ఒక వేళ ఇదంతా నిజమే అనుకున్నా ప్రధాన ఆధారం మాత్రం నిందితులుగా వున్న రాజీవ్, శ్రావణ్ల వాగ్మూలాలే. ఫోన్ కాల్ డేటా కూడా వుందంటున్నారు. వుండొచ్చు. మరి వాస్తవంగా తేలవలసింది ప్రభాకరరెడ్డి మరణం సంగతి. ఒకే పోలీసు స్టేషన్లో రెండవసారి ఆత్మహత్య ఇది. ఇప్పటికి పోలీసులు, హౌం గార్డులు వగైరా మొత్తం పదిమంది వరకూ తెలంగాణలో ఇలాగే మరణించారు. ఎక్కువ సందర్భాల్లో కుటుంబ సభ్యులు పై అధికారుల వేధింపులు జరిగాయని ఆరోపించారు. శిరీష తలిదండ్రులు అత్తమామలు కూడా పోలీసుల కథనాలను ఆమోదించడం లేదు. నిశితంగా పరిశీలిస్తే ఈ కథనాల్లో అనేక లొసుగులు కూడా వున్నాయి. చనిపోయిన వారి ప్రవర్తనను కారణంగా చెప్పి చావుల తీవ్రతను తగ్గించడం ఏ విధంగా సమంజసం? వారు ఆ కారణంగానే చనిపోయారా? లేక ఆ కారణంతో మరెవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారా లోతుగా దర్యాప్తు చేయవలసిన అవసరం వుంటుంది. కాని అత్యున్నతాధికారులే ముందస్తుగా కేసు మూసేసినట్టు మాట్లాడిన తర్వాత ఎవరు ముందుకొస్తారు? ఏ ఆ ధారాలు తీసుకొస్తారు? నయీం కేసు గాని, భూ కుంభకోణాలు గాని ఇప్పుడు ఈ ఆత్మహత్యలు గాని అంతా క్షణాలమీద ప్రకటించేయవలసిన అవసరం లేదు కదా! ఒక వేళ ప్రభాకరరెడ్డి పొరబాటు వుందనుకున్నా ఆ సమయానికి ఆయన పోలీసు అధికారిగానే వున్నారు గనక శాఖకూ బాధ్యత వుంటుంది కదా..