టాలీవుడ్ లో మరో కొత్త కాంబోకి తెర లేచింది. బెల్లంకొండ శ్రీనివాస్ – విజయ్ కనకమేడల కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్ లు కీలక పాత్రలు పోషించబోతున్నట్టు సమాచారం. ఓరకంగా ఇది మినీ మల్టీస్టారర్ అనుకోవాలి. మంచు మనోజ్ ఈమధ్య విలన్ పాత్రల వైపు మొగ్గు చూపిస్తున్నాడు. ‘మిరాయ్’లో తను విలన్. ఇవి కాకుండా మరో రెండు సినిమాల్లో విలన్ పాత్రల్లోనే కనిపించబోతున్నాడు. ఈ జాబితాలో మరో సినిమా చేరినట్టే.
‘నాంది’తో ఆకట్టుకొన్న విజయ్ కనకమేడల మరో పవర్ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేసుకొన్నట్టు ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఈ యేడాది ప్రారంభంలోనే ఈ సినిమా పట్టాలెక్కాల్సింది. కానీ బెల్లంకొండ షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల కుదర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.