బెల్లంకొండ శ్రీనివాస్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుసగా సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ‘టైసన్ నాయుడు’, ‘కిష్కింద పురి’ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు లుధీర్ బైరెడ్డి సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. ఈలోపు మరో సినిమాకు పచ్చ జెండా ఊపాడు. ‘ మా ఊరి పొలిమేర’ ఫేమ్ అనిల్ విశ్వనాథ్ తో బెల్లంకొండ ఓ సినిమా చేయబోతున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ఈ చిత్రానికి ‘ఆట మొదలైంది’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి స్క్రిప్టు లాక్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలెడతారు.
‘మా ఊరి పొలిమేర’ రెండు భాగాలుగా విడుదలైంది. ఒకటి ఓటీటీలో వస్తే, రెండోది నేరుగా థియేటర్లలో విడుదల చేశారు. రెండు చిత్రాలకూ మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ గా కూడా లాభాలొచ్చాయి. అందుకే మీడియం రేంజ్ హీరోల దృష్టి అనిల్ పై పడింది. ఈ సినిమాలో యాక్షన్ తో పాటుగా, సోషియో ఫాంటసీ అంశాలు బాగా మేళవించారని తెలుస్తోంది. ఈ యేడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం లుధీర్ బై రెడ్డి దర్శకత్వంలో సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ చిత్రానికి ‘హైందవ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. నాలుగొందల యేళ్ల క్రితం దేవాలయం చుట్టూ నడిచే కథ ఇది. దశావతాచాల నేపథ్యం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.