బెల్లంకొండ శ్రీనివాస్ జోరుమీద ఉన్నాడు. ఒకదాని తరవాత మరో ప్రాజెక్ట్‌ని ఓకే చేయించుకొంటున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ ఓ సినిమా చేస్తున్నాడు. రమేష్ వర్మతో ‘రాక్షసుడు 2′ ఓకే అయ్యింది. ఇప్పుడు మున్నా అనే కొత్త దర్శకుడి కథకు ఓకే చెప్పాడు. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా తీశాడు మున్నా. ఇది తనకు రెండో ప్రయత్నం. ఈసారి ఓ సోషియో ఫాంటసీ కథని రెడీ చేశాడని టాక్. ఈ సినిమాలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడుతో పాటు దేవుళ్లంతా కనిపిస్తార్ట. ఆ దేవలోకంలో హీరో ఏం చేశాడన్నదే సినిమా కథ. ఈ జోనర్లో బెల్లంకొండ ఇప్పటి వరకూ ఏ సినిమా చేయలేదు. అందుకే తనకు వెరైటీగా ఉంటుందని ఈ సినిమాని ఒప్పుకొన్నాడని తెలుస్తోంది. బెల్లంకొండ ఇప్పటి వరకూ యాక్షన్ సినిమాలకు పరిమితమైపోయాడు. తనని అలాంటి కథల్లోనే చూసి విసుగొచ్చేసింది. సాగర్ చంద్ర కథ కూడా దాదాపుగా అలాంటిదే. ‘రాక్షసుడు 2’ తో కాస్త రిలీఫ్ దొరకొచ్చు. ఇప్పుడు మున్నా కథ కూడా బెల్లంకొండని కొత్తగా ప్రజెంట్ చేసేదే. జనవరిలో ‘రాక్షసుడు 2’ సెట్స్‌పైకి వెళ్తుంది. ఆ తరవాత మున్నా కథ మొదలెడతారు.