దసరాకి మూడు పెద్ద సినిమాలు వచ్చాయి. బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ డబ్బింగ్ సినిమా లియో. నిజం చెప్పాలంటే డబ్బింగ్ సినిమా అయినప్పటికీ లియో కోసం చాలామంది ఆసక్తి చూశారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ గత చిత్రం ‘విక్రమ్’ పాన్ ఇండియా విజయం సాధించింది. ఆయనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ఏర్పడింది. చాలా మందిని అది ఆకర్షించింది. లియో పై కూడా అలానే అంచనాలు భారీగా పెరిగాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత సీన్ రివర్స్ అయిపొయింది. లియో తేలిపోయింది. భారీ అంచనాలు కారణంగా ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఓకే కానీ రెండో రోజు నుంచి దారుణంగా డ్రాప్ అయ్యింది.
ఈ రెండు సినిమాలతో పోల్చుకుంటే రవితేజ టైగర్ నాగేశ్వరరావు పై కొంచెం అంచనాలు తక్కువే. కారణం.. ఇందులో రవితేజ తప్పితే దర్శకుడి ఎట్రాక్షన్ లేదు. అనిల్ రావిపూడి, లొకేష్ కనరాజ్ లైమ్ లైట్ లో వున్నారు. కానీ టైగర్ దర్శకుడు వంశీ ఇప్పటివరకూ ఒక్క భారీ సినిమా కూడా చేయలేదు. ఓ రెండు చిన్న సినిమాలు చేశాడు. కానీ వాటితో చెప్పుకోదగ్గ ఫేం రాలేదు. టైగర్ కి కేవలం రవితేజ మాత్రమే ఎట్రాక్షన్. సినిమా రిజల్ట్ కూడా అలానే వచ్చింది. రవితేజ కష్టపడ్డాడు కానీ కథ కథనాలు ఆసక్తికరంగా లేవనే టాక్ డే వన్ నుంచే జనాల్లోకి వెళ్ళిపోయింది. పైగా మూడు గంటల రన్ టైం మరో నెగిటివ్ గా మారింది.
బాలకృష్ణ భగవంత్ కేసరికి మొదటి ఆట నుంచే యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులే కాదు విమర్శకులు కూడా మంచి సబ్జెక్టని ప్రశంసించారు. బాలకృష్ణ కొత్తగా కనిపించడం, అనిల్ రావిపూడి నమ్మిన ఎమోషన్ వర్క్ అవుట్ కావడం, సినిమాలో మంచి సందేశం వుందని జనాల్లోకి వెళ్ళడం తో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా క్యూ కట్టారు. రోజు గడుస్తున్న కొద్ది కేసరికి వస్తున్న ఆదరణ పెరుగుతోంది. నిజంగా దసరా విన్నర్ అనిపించుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా కనెక్ట్ ఐతే ..ఖచ్చితంగా దాని రన్ స్టడీగా పెరుగుతూనే వుంటుంది. ఇప్పుడు భగవంత్ కేసరి విషయంలో అది కనిపిస్తోంది.
మరో కలిసొచ్చే విషయం ఏమిటంటే.. ఈవారం కొత్త సినిమాలు లేవు. నవంబర్ 3నే మళ్ళీ కొత్త సినిమాలు పలకరిస్తున్నాయి. ఈ లెక్కన మరో వారం రోజులు భగవంత్ కేసరివే. ఇకపోతే నవంబర్ మూడున వస్తున్న తరుణ్ భాస్కర్ కీడా కోలా, సంపూర్నేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్, సత్యం రాజేష్ పొలిమేర 2 చిత్రాలు కూడా దేనికవే ప్రత్యేకం. వీటితో భగవంత్ కేసరి పై ఎలాంటి ప్రభావం వుండదనే చెప్పాలి. ఈ రకంగా భగవంత్ కేసరి చాలా లాంగ్ రన్ దొరికినట్లే.