తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు .. కూర్చుని తమ స్ట్రాటజీని మాట్లాడుకుంటారో లేదో కానీ ఎవరి వాదన వారు వినిపిస్తూ ఉంటారు. అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క చేసిన ప్రసంగం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే కాదు.. ఇతర పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారుతోంది. అసెంబ్లీలో ఏ మాత్రం బలం లేని బీజేపీపై ఒంటికాలితో లేచిన భట్టి విక్రమార్క.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చే సరికి.. సలహాలు.. సూచనలతో సరి పెట్టారు. ఆయన తీరు చూసి బీజేపీ నేతలు కూడా ముందుగా రేవంత్ రెడ్డి… తమ విధానమేంటో భట్టికి చెప్పాలని సెటైర్ వేశారు. బీజేపీ విధానాలపై కేసీఆర్ అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించారు.
నిజానికి రాష్ట్ర సమస్యలపై చర్చించాలి కానీ కేసీఆర్ జాతీయ రాజకీయ కోణంలో అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ ప్రసంగానికి మద్దతన్నట్లుగా భట్టి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడాల్సిన సమస్యలు కాంగ్రెస్ పార్టీ వద్ద చాలా ఉన్నాయి. కానీ భట్టి విక్రమార్క అవన్నీ పట్టించుకోలేదు.భట్టి ప్రసంగం చూసిన వారికి.., కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తుందేమో అన్న సెటైర్లు సోషల్ మీడియాలో వేశారంటే అతిశక్తి కాదు.
రాహుల్ పాదయాత్ర ప్రారంభంలో కొంత మంది సీనియర్ నేతలు టీఆర్ఎస్ను కలుపుకుని వెళ్తామని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో భట్టి ప్రసంగం కూడా దానికి తోడైంది. కేసీఆర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పదవి నుంచి దింపాలని కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకు రావాలని .. సర్వశక్తులు ఒడ్డుతున్న రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు.. సీనియర్ నేతల వ్యవహారశైలితోనూ పోరాడాల్సి వస్తోంది. టీఆర్ఎస్పై కాంగ్రెస్ పోరాటం .,. లైట్ కాకుండా చూసుకోవాల్సి వస్తోంది.