పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి రిటర్న్ అధికారి ప్లస్ కలెక్టర్ పిలిచి మరీ డిక్లరేషన్ ఇచ్చారు. ఆయన రానంటే… ఇంటికి వెళ్లి బతిమాలి ఇవ్వాల్సి వచ్చేది. అందులో సందేహం లేదు. ఈ విషయం ఆర్వో.. కలెక్టర్కు తెలియనిది కాదు. కానీ ఆమె మాత్రం ఏం చేస్తారు..? నేరుగా సీఎం ఫోన్ చేసి ఇవ్వొద్దని చెప్పారు. ఆమె పాటించారు. అది ఆయన అధికార పరిధి కాకపోయినా పాటించకపోతే ఎల్లుండి నుంచి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆమెకు తెలుసు.
అందుకే కొన్ని చీవాట్లు… మరికొన్ని విమర్శలతో అయినా తట్టుకోవచ్చని ఇవ్వకుండా ఇంటికెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత పిలిచి ఇచ్చారు. ఇప్పుడు ఇలా కొన్ని గంటలు ఆపడం వల్ల టీడీపీ నేతలకు.. గెలిచిన అభ్యర్థికి నష్టం ఏమైనా వచ్చిందా ? . ఏమీ లేకపోగా… ప్రభుత్వం ఇలా ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోందని… ప్రజా తీర్పును లెక్క చేయడం లేదని మరక మాత్రం పడిపోయింది.
పాలకులకు అధికారంతో ఏమైనా చేయవచ్చన్న ఓ దురహంకారం కళ్లను కప్పేసినట్లుగా అందరికీ ఓ స్పష్టత వచ్చింది. దీని వల్ల ఎవరికి నష్టం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడులు అంతిమంగా నష్టమే చేస్తాయి. తాత్కలిక మానసిక ఆనందం కోసం ఏదైనా చేసుకుంటే… మొదటికే మోసం వస్తుంది. గుర్తించనంత కాలం… ఈ పతనం కొనసాగుతూనే ఉంటుంది.