ఉత్తరప్రదేశ్ బీజేపీని ఇప్పుడు టెన్షన్‌కు గురి చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలవాలన్నా.. నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావాలన్నా.. ఉత్తరప్రదేశ్‌లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలి. గత ఎన్నికల్లో 80 స్థానాలకు గాను… 71 లోక్‌సభ సీట్లు బీజేపీ గెలుచుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విపక్షాలన్నీ ఏకం అయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేకత కూడా బలంగా కనిపిస్తూండటంతో… ఎదురీత తప్పదని తేలిపోయింది. గోరఖ్‌పూర్, ఫుల్పూర్, కైరానా పార్లమెంట్ స్థానాల ఉపఎన్నిల ఫలితాల సరళిని చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ తన వ్యూహాన్ని మార్చుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఇప్పుడు మోదీ- షా ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదే యూపీ ముఖ్యమంత్రిని మార్చడం.
నిజానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన చాలా కొద్ది కాలంలోనే తీవ్రమైన వ్యతిరేకత తెచ్చి పెట్టుకున్నారు. మొదట్లో చిన్న చిన్న విషయాలపై పబ్లిసిటీ భారీగా పొందినా.. కీలకమైన విషయాల్లో ఆయన పాలనా పటిమను చూపలేకపోయారు. గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో చిన్న పిల్లల మరణాలు, షహరాన్‌పూర్‌లో దళితులపై దాడులు, ఉన్నావో అత్యాచార ఘటన.. యూపీ ప్రభుత్వానికి మచ్చల్లా మారాయి. దీంతో సహజంగానే..ముఖ్యమంత్రి మార్చాలన్న డిమాండ్.. బీజేపీలో అంతర్గతంగా వినిపిస్తోంది. నిజానికి యూపీ సీఎంగా ఆదిత్యనాథ్‌ను నియమించడం.. నరేంద్రమోదీ, అమిత్ షాలకు ఇష్టం లేదని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ ఒత్తిడి వల్లే యోగిని నియమించినట్లు మొదట్లో చెప్పుకున్నారు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆర్ఎస్ఎస్ కూడా సమర్థించలేనివిగా మారడంతో.. మోదీ, షాల పని సులువయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
యోగిని తప్పిస్తే.. మరెవరు ముఖ్యమంత్రి అన్న ప్రశ్న.. సహజంగానే వస్తుంది. దీనికి ఇన్‌స్టంట్‌గా కేంద్రం హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరు వినిపిస్తోంది. 2000 నుంచి 2002 వరకు.. యూపీ ముఖ్యమంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ పని చేశారు. ఆ తర్వాత రెండు సార్లు బీజేపీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. యూపీలో బీజేపీ తిరుగులేని విజయం సాధించిన తర్వాత మొదటగా రాజ్‌నాథ్ పేరే ప్రచారంలోకి వచ్చింది. కానీ అప్పుడు చాన్స్ యోగికి వెళ్లింది. ఇప్పుడు మళ్లీ రాజ్‌నాథ్ సింగ్ పేరు ప్రచారంలోకి వస్తోంది. నరేంద్రమోదీ, అమిత్ షా కూడా వ్యూహాత్మకంగా రాజ్‌నాథ్ సింగ్‌ను యూపీకి పంపించడమే మేలని భావిస్తున్నారు. వారు పట్టుబడితే రాజ్‌నాథ్ కూడా యూపీకి వెళ్లక తప్పకపోవచ్చు.
ప్రస్తుత పరిస్థితుల్లో యూపీలో బీజేపీ పరిస్థితిని మెరుగుపరచకపోతే.. డబుల్ డిజిట్ సీట్లు కూడా రాకవపోచ్చని మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికప్పుడు విపక్షాల ఐక్యతను చెడగొట్టలేకపోయినా.. సొంత పార్టీలో సంస్కరణ చేయకపోతే.. కష్టం అని ఇప్పటికే బీజేపీ పెద్దలు నిర్ణయించేసుకున్నారు. ముందుగా ముఖ్యమంత్రి మార్పు.. ఆ తర్వాత ఓబీసీ రిజర్వేషన్ల వ్యవహారంతో… కాస్త మార్పు తెచ్చి.. పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలను బీజేపీ చేయబోతోందన్నది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.