బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ రాజీనామా ఇటీవలి జాతీయ రాజకీయ పరిణామాల్లో పెద్ద మలుపే. అయితే వూహించినదేమీ కాదు. ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్పై సిబిఐ ఆరోపణలు వచ్చినప్పటి నుంచి రగులుతున్న రాజకీయానికి పరాకాష్ట ఇది. అతనితో రాజీనామా చేయించేందుకు లాలూ సిద్దం కాలేదు.కలసి వుండటానికి నితిష్ సిద్ధపడలేదు. ఈ రెండు పట్టుదలల్లోనూ రాజకీయం వుంది. ఏమంటే ఒకసారి తలవంచితే తనకు స్థానం వుండదన్నది లాలూ ఆలోచన. కొరకరాని కొయ్యలాటి లాలూ కుటుంబాన్ని వదిలించుకోవడానికి ఇది బ్రహ్మాస్త్రమన్నది నితిష్ భావన. తాను తేజస్విని వివరణ కోరానే గాని రాజీనామా అడగలేదని నితిష్ చేసిన వ్యాఖ్య ఇందుకు నిదర్శనం. ఏమైతేనేం తన పాత నేస్తం బిజెపితో మళ్లీ చెలిమి చేయడం సుఖమన్న అభిప్రాయానికి ఆయన వచ్చేశారు. ప్రధాని కావాలన్న ఆరాటంలో మోడీని మాత్రం భరించలేకపోయిన నితిష్ ఇప్పుడు ఆయన ఆధిపత్యం అనివార్యమని రాజీ పడ్డారు.కనుకనే ఇతర సంప్రదింపులు సంఘర్షణలు లేకుండా నేరుగా రాజీనామా ఇచ్చేశారు.వెంటనే మోడీ హర్షించడం, దానికి ఈయన కృతజ్ఞతలు చెప్పడం అంతా పక్కా స్కెచ్లోనే వున్నాయి. గతంలో నితిష్ ప్రభుత్వంలో డిప్యూటీగా పనిచేసిన బిజెపి నేత సుశీల్ కుమార్ మోడీ మరోసారి అందుకు తాము సిద్ధమంటూ గవర్నర్కు చెబుతున్నారు.సో ఖేల్ ఖతం.. శాసనసభలో బలాబలాల పరంగా చూస్తే 71 స్థానాలున్న జెడియు ,53 వున్న బిజెపి కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభసాధ్యం. 80 వున్న ఆర్జేడీ 27 వున్న కాంగ్రెస్ను కలుపుకొన్నా కష్టమే.ఈ పరిస్థితుల్లో ఎవరూ కోరి లాలూతో కలిసేది వుండదు. కనుక బీహార్ సీన్ క్లియర్. ఎప్పుడు ఎలా అన్నది మాత్రమే చూడాల్సివుంది.