గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బీజేపీ పూర్తిగా వదులుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయనను సస్పెండ్ చేసిన బీజేపీ ఇప్పటి వరకూ దాన్ని తొలగించలేదు. ఆయన సస్పెండెడ్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. పదే పదే తన సస్పెన్షన్ తొలగించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా ఆయనపై బీజేపీ ప్రభుత్వం ఉన్న మహారాష్ట్రలోనే కేసు నమోదు చేశారు. ముంబయిలో జనవరి 29వ తేదీన జరిగిన సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై స్థానిక పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు.
ముంబై ర్యాలీలో పాల్గొన్న ఇతర బీజేపీ నాయకులు వివాదాస్పదంగా మాట్లాడకపోయినా, రాజా సింగ్ మాత్రం దాదాపు 30 నిమిషాల పాటు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారు ప్రసంగంలో ‘లవ్-జిహాద్’ గురించిమాట్లాడారు. మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు నిర్వహించే షాపుల నుంచి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయకూడదని నేను ప్రతి హిందువును కోరుతున్నానని చెప్పుకొచ్చారు.
రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లుగా విమర్శలు రావడంతో పోలీసులు చివరికి కేసు పెట్టారు. నెలన్నర తర్వాత కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేశారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా బీజేపీ రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక బీజేపీ కూడా రాజాసింగ్‌తో సమస్యేనని వద్దనుకుంటున్నట్లుగా తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయంటున్నారు.